తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్‌కు ప్రధాని మోదీకి మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఢిల్లీ నుంచి గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేరళ సీఎం పినరయి విజయన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయన్ తనకు రాసిన లేఖలో 2014-23 మధ్య కాలంలోని అంశాలను ప్రస్తావించారని, ఆ సమయంలో ఆయన సన్నిహిత మిత్రుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన పొరపాట్ల వల్లే తెలంగాణ ప్రజలు ఆయన్ను గద్దె దించారని, ఇప్పుడు కేరళ ప్రజలు కూడా విజయన్‌ను మార్చడం ఖాయమని జోస్యం చెప్పారు.

పినరయి విజయన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదు..
పినరయి విజయన్‌పై శబరిమల బంగారం చోరీ, గోల్డ్ స్మగ్లింగ్ వంటి తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన జోలికి వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విజయన్‌కు గాడ్‌ఫాదర్‌లా ఢిల్లీలో మోదీ ఉన్నారని, అందుకే ఆయన ఈ కేసుల నుండి తప్పించుకుంటున్నారని విమర్శించారు. దేశం కోసం ఆస్తులను, జీవితాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని కేసులతో వేధిస్తున్న కేంద్రం, కేజ్రీవాల్ వంటి నేతలను అరెస్ట్ చేసిన ఈడీ.. విజయన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని మోదీ, విజయన్ మధ్య ఉన్న అవగాహన, చీకటి ఒప్పందాల వల్లే కేరళ సీఎంపై ఎలాంటి అరెస్టులు, విచారణలు జరగడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ రహస్య బంధాన్ని కేరళ ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని, ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తరహాలోనే కేరళలో కూడా త్వరలో మార్పు వస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

పినరయి విజయన్‌తో చర్చకు రెడీ..

‘పినరయి విజయన్ ఎప్పుడు సిద్ధంగా ఉన్నా, నేను ఆయనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను... ఆయన రోల్ మోడల్స్ ఎవరు. నరేంద్ర మోదీ, అమిత్ షా నా, లేక జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీలను ఫాలో అవుతున్నారా చర్చిద్దాం. పినరయి విజయన్ నరేంద్ర మోదీని తన రోల్ మోడల్‌గా భావిస్తున్నారు. ఇది కేరళ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. మరొక నరేంద్ర మోదీలా పినరయి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో కేరళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని’ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.