న్యూఢిల్లీ: SIR ప్రక్రియ జరగని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోగా, ఓట్లు తొలగించిన బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఒకవైపు జనాభా పెరుగుతుంటే, మరోవైపు దేశంలో ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో సైమన్ కమిషన్ భారత్‌కు వచ్చినప్పుడు సైమన్ గో బ్యాక్ అని దేశమంతా నినాదాలు చేసిందని, ప్రస్తుతం SIR పేరుతో ఓట్లు తొలగించడంతో జ్ఞానేశ్ కుమార్ గోబ్యాక్ అంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు చేస్తున్నది మరో స్వాతంత్య్ర పోరాటమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ర్యాలీకి సంబంధించి పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేస్తూ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో 'ఇండియా' కూటమి చేపట్టిన ఈ పోరాటం కేవలం ఒక సాధారణ రాజకీయ నిరసన కాదని, దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న మరో స్వాతంత్య్రోద్యమంగా అభివర్ణించారు. తన అధికారం నిలబెట్టుకునేందుకు ప్రధాని మోదీ గతంలో ఈడీ, సీబీఐ, ఇన్‌కం ట్యాక్స్‌ విభాగాలను వినియోగించారని, ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్‌ను వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలకు మద్దతుగా ఉండే దళితులు, గిరిజనులు, యువత ఓట్లను లక్ష్యంగా చేసుకుని 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) పేరుతో అక్రమంగా తొలగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. సీఈసీ ఏకపక్షంగా వ్యవహరించారని తోటి ఎన్నికల కమిషనర్లు చెబుతున్నా.. జ్ఞానేశ్ కుమార్‌ను మోదీ కొనసాగించడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.

సమన్వయం చేసుకోవడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఈ నిరసన ప్రదర్శనలో పార్టీ శ్రేణులు చాలా క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలంతా తమకు కేటాయించిన బస్సుల్లోనే బారాకంబా (Barakhamba) ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టు వైపు శాంతియుతంగా మార్చ్ నిర్వహించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ర్యాలీ సందర్భంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా, లేదా నాయకులు అదుపులోకి తీసుకుంటే కనుక తక్షణమే సమాచారం అందించడానికి, సమన్వయం చేసుకోవడానికి ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.