CM Revanth Reddy: తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు లేని ప్రత్యేక ఏర్పాట్లు, వెసులుబాట్లు మాజీ సీఎం కేసీఆర్‌కు ఎందుకు కల్పించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వి, అక్కడి నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు సాగునీటిని మళ్లించారని ఆరోపించారు. దమ్ముంటే ఆ పంపుల కనెక్షన్‌ను తొలగించేందుకు కేసీఆర్ ముందుకు వస్తారా అని సవాల్ విసిరారు. ఫాంహౌస్‌కు నీటి తరలింపు వ్యవహారంపై నిజనిర్ధారణ కమిటీ వేద్దామా అని బీఆర్ఎస్ నాయకులకు సవాల్‌ విసిరారు.

Also Read: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి

కేసీఆర్ సంతకం పెట్టలేదా?

ఈ సందర్భంగా మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, యూకే దేశాల ప్రస్తావన తెస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం తిప్పికొట్టారు. వంద దేశాల్లో ఎల్‌నినో సమస్య ఉందని ఐరాస చెబుతుంటే, బీఆర్ఎస్ నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు అని కొందరు అంటున్నారని, కానీ 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 515 టీఎంసీలని కేసీఆర్ సంతకం పెట్టలేదా అని ప్రశ్నించారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ వద్ద తెలంగాణకు శాశ్వతంగా మరణ శాసనం రాసింది ఎవరని నిలదీశారు. సీఎం చంద్రబాబు ముందు మోకరిల్లి కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను ధారాదత్తం చేశారని ఆరోపించారు.

Also Read: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!

లక్ష కోట్లతో కడితే కుంగిపోయింది

ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ స్థాయి నష్టం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.8 లక్షల కోట్లు ఖర్చుచేసి, రూ.40 వేల కోట్లు బకాయిలు పెట్టారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్‌చేస్తే బీఆర్ఎస్ నాయకులకు కడుపుమంట వస్తోందని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై ఎన్నిసార్లయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. గోదావరి నదిపై పేరు మార్చి రూ.లక్ష కోట్లతో కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని, ఇప్పుడు మళ్లీ కట్టాలంటున్నారని విమర్శించారు. ప్రజలు అమాయకులు కాదని, అన్నింటిపై వారికి పూర్తి అవగాహన ఉందని సీఎం స్పష్టం చేశారు.

Also Read:  గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం