చిత్తూరు నగర శివార్లలోని దొడ్డిపల్లి ప్రాంతంలో ఓ చిరుత స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత 3 రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా అక్కడి జగనన్న లేఅవుట్ పరిసరాల్లో చిరుత కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, తాజాగా ఈ చిరుత పులి గాయాలపాలై, స్పృహ తప్పి పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.

దొడ్డిపల్లికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను పరిశీలించారు. చిరుత అపస్మారక స్థితిలో ఉండటంతో దానిని సురక్షితంగా తరలించేందుకు తిరుపతి నుంచి రావాల్సిన ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ టీమ్ (Rescue Team) కోసం అధికారులు వేచి చూస్తున్నారు. చిరుతకు తగిలిన గాయాలు ఎలా అయ్యాయనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. జనావాసాల మధ్య చిరుత పడి ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులకు సమీపంలో ఉన్న గ్రామాలపై గత కొంతకాలంగా క్రూర మృగాల దాడి పెరుగుతోంది. వేసవి కాలం కావడంతో నీరు, ఆహారం కోసం చిరుతలు అడవిని దాటి జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీ అధికారులు భావిస్తున్నారు. గాయపడిన ఈ చిరుతను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ (ఎస్వీ జూ)కు తరలించి చికిత్స అందించే అవకాశం ఉంది.