<p>Chhattisgarh Encounter News: బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లింది. దక్షిణ బస్తర్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉసూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అయితే 12 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ (Bijapur Encounter) జరిగిన ప్రదేశంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకూ పోలీసులు, భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌లో 28 మంది మావోయిస్టులు హతమయ్యారు.</p>
<p>పూజారి కాంకేర్‌- మారేడుబాక అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో బీజాపూర్, సూక్మా, దంతెవాడ జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌), కోబ్రా టీమ్, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన జవాన్లు దండకారణ్యంలో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు కనిపించడంతో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. </p>
<p>జనవరి 6న బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీతో వాహనం పేల్చివేయగా 8 మంది జవాన్లు, ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ఘటనతో బీజాపూర్, బస్తర్ ప్రాంతంలో పోలీస్ బలగాలు మావోయిస్టులు అమర్చిన మందు పాతర్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కోబ్రా టీమ్, సీఆర్పీఎఫ్ టీమ్స్ అప్రమత్తం అయ్యా్యి. మావోయిస్టుల ఏరివేతకు బస్తర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు బీజాపూర్ జిల్లా పుత్కేల్ అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలిన ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఉత్తర బస్తర్ డివిజన్ టెక్నికల్ ఏరియా కమాండర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొండగావ్ జిల్లా ఎస్పీ అక్షయ్ కుమార్ ఎదుట కీలక మావోయిస్టు గిజ్రురమ్‌ ఉసెండి గురువారం లొంగిపోయాడు. అతడి మీద రూ. 5 లక్షల రివార్డ్ సైతం ఉంది.</p>