Chandrababu Naidu CID Case Quashed: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో సుదీర్ఘ కాలంగా నలుగుతున్న అత్యంత కీలకమైన కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో అత్యంత భారీ ఊరట లభించింది. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పరిధిలో అసైన్డ్ భూముల బదిలీ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన క్రిమినల్ కేసును హైకోర్టు క్వాష్ చేసింది.

ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబుకు, నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం, తుదితీర్పు వెల్లడించింది. ఎటువంటి బలమైన ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఈ కేసులను నమోదు చేశారన్న ప్రతివాదుల వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి ఈ కేసులను రద్దు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

ఏంటీ అమరావతి అసైన్డ్‌ భూముల కేసు

రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కింద భూముల సేకరణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భూ సేకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా దళితలకు కేటాయించిన అసైన్డ్‌ భూములను బెదిరించి, తక్కువ ధరలకే బినామీల ద్వారా కొనుగోలు చేయించారనేది కేసు.

2021 మార్చిలో అప్పటి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సిఐడీ పోలీస్‌ స్టేషన్‌‌లో తొలి కేసు నమోదు అయ్యింది. భూముల బదిలీ నిరోధక చట్టం ఉల్లంఘనలతోపాటు ఐపీసీ సెక్షన్లు 166, 217, 120-బి సహా ఇర చట్టాల కింద చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణపై అప్పట్లో కేసులు నమోదు చేశారు. రాజధాని ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా అసైన్డ్‌ భూముల యజమానులు కూడా పట్టా భూముల తరహాలోనే పరిహారం ప్యాకేజీ వర్తింపజేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్‌ నెంబర్‌ 41 అక్రమమైందని కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ఉత్తర్వులు తెచ్చారని సీఐడీ ఆరోపించింది.

మార్చి 19న ఈ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణ నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ కేసులో సిఐడీ దర్యాప్తును ముమ్మరం చేయడం, నారాయణను నిందితుడిగా చేర్చటంపై హైకోర్టులో వరుస విచారణలు జరిగాయి. 2024 మార్చిలో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ తుది ఛార్జిషీటును దాఖలు చేసింది. ఇంతలో క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం మొన్నటి ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్ చేసింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ చంద్రబాబు, నారాయణపై ఉన్న కేసులను హైకోర్టు 15జులై 2026లో క్వాష్ చేసింది.

హైకోర్టు కొట్టేయడానికి కారణాలు

ఈ కేసులో ప్రతివాదుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదించారు. సుదీర్ఘ విచారణలో హైకోర్టు ప్రధానంగా కొన్ని కీలకాంశాలను పరిగణలోని తీసుకుంది. రాజధాని ల్యాండ్ పూలింగ్ కోసం తీసుకొచ్చిన జీవోలు , ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై నేరపూరిత ఉద్దేశాలను ఆపాదించడం చెల్లదని వాదించారు. ఏపీసీఆర్డీఏ చట్టం సెక్షన్ 146 ప్రకారం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలకు చట్టపరమైన రక్షణ ఉంటుందని కోర్టుకు వివరించారు.

దళితుల నుంచి భూములను బలవంతంగా లాక్కున్నట్టు కానీ, లేదా బెదిరించి తక్కువ ధరలకు కొనుగోలు చేసినట్టు కానీ నిరూపించే ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు సీఐడీ సబ్‌మిట్ చేయలేకపోయిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తగిన ఆధారాలు లేకుండా ఈ కేసు నమోదు చేశారన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. అమరావతి అసైన్డ్‌ భూముల బదిలీ వ్యవహారంలో సుదీర్ఘ కాలంగా కొనసాగిన న్యాయపోరాటానికి హైకోర్టు తీర్పుతో తెరపడింది.