CM Revanth inaugurates Chanaka Korata pump house: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం దశాబ్దాల కల నెరవేరుస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం భోరజ్ మండలం హతిఘాట్ వద్ద చనాక-కొరాటా పంప్ హౌస్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని గతంలో ప్రకటించిన రేవంత్.. ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. పంప్ హౌస్ ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి స్థానిక రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి రైతుల పొలాల్లో సాగు జలాలు పారించే సంకల్పంతో పని చేస్తున్నాం.
దానిలో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా, భోరజ్ మండలం, హతిఘాట్ లో చనాక- కొరాటా పంప్ హౌస్ ను ప్రారంభించి, లోయర్ పెనుగంగ… pic.twitter.com/Tf6r8MdhNY

— Revanth Reddy (@revanth_anumula) January 16, 2026

కేవలం మాటలకే పరిమితం కాకుండా రైతుల పొలాల్లో సాగు జలాలు పారించడమే తమ ప్రభుత్వ సంకల్పమని ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించామని, అందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నామని కాంగ్రెస్ నేతుల చెబుతున్నారు. చనాక-కొరాటా ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇది ఉత్తర తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రాన్ని మారుస్తుందని వారంటున్నారు.

లోయర్ పెనుగంగ ప్రధాన కాలువలోకి నీరు చేరడంతో ఆదిలాబాద్ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు శాశ్వత సాగునీటి పరిష్కారం లభించినట్లయిందని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రాధాన్యత కలిగిన మరిన్ని పెండింగ్ ప్రాజెక్టులను ఇదే స్ఫూర్తితో పూర్తి చేసి, ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు.

చనాకా-కొరాటా బ్యారేజీని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందించడం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి లోయర్ పెన్ గంగా ప్రధాన కాలువకు మళ్లిస్తారు. దీనివల్ల జైనథ్, బేల, అదిలాబాద్ మండలాల్లోని మెట్ట భూములకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. వర్షాకాలంలో పెన్ గంగా నదిలో ప్రవహించే అదనపు జలాలను నిల్వ చేసుకునేందుకు ఈ బ్యారేజీ ఎంతో కీలకం.

ఈ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉండటంతో ప్రారంభంలో మహారాష్ట్రతో కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల మహారాష్ట్ర వైపు ఉన్న గ్రామాలు, భూములు మునిగిపోతాయనే ఆందోళనతో ఆ రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. అయితే, 2016లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం , మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన చారిత్రాత్మక ఒప్పందంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. బ్యారేజీ ఎత్తు, ముంపు విస్తీర్ణంపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మహారాష్ట్రకు కూడా కొంత మేర నీటిని ఇచ్చేలా, ఆ రాష్ట్ర భూసేకరణకు తెలంగాణ నిధులు చెల్లించేలా ఒప్పందం కుదిరిన తర్వాతే పనులు వేగవంతమయ్యాయి. సరిహద్దు వివాదాల కారణంగా దశాబ్దాల కాలం పెండింగ్‌లో ఉన్న లోయర్ పెన్ గంగా ప్రాజెక్టులో ఈ చనాకా-కొరాటా ఒక కీలక భాగం.