Chakali Ilamma: భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం అని కమ్యూనిస్టులు చెప్పే సిద్ధాంతం ఒక కులవృత్తి చేసుకునే మహిళ ద్వారా ఉద్భవించిందంటే నమ్మగలరా? స్త్రీలంటే చిన్నచూపు చూసేవారందరికీ చాకలి ఐలమ్మ పోరాటం కనువిప్పు కలిగించింది. పోలీసులను, దేశ్‌ముఖ్‌లను ఎదిరించి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తన పేరును లిఖించుకున్న వీరమాత చాకలి ఐలమ్మ. ఈ పోరాటం తర్వాతే నిజాంకు, దేశ్‌ముఖ్‌ల ఆగడాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం పురుడుపోసుకుంది. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా, ఈ కథనం ద్వారా ఆ వీరవనితను స్మరించుకుంటూ నాటి పరిస్థితులను తెలుసుకుందాం.

చిట్యాల ఐలమ్మే మన వీరమాత చాకలి ఐలమ్మ

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, కిష్టాపురం గ్రామంలో సెప్టెంబర్ 26, 1895 లో రజక కుటుంబంలో జన్మించింది చాకలి ఐలమ్మ. ఆమె తల్లి ఒరుగంటి మల్లమ్మ, తండ్రి సాయిలు. ఐలమ్మకు చిన్నతనంలోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో బాల్యవివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి కులవృత్తి అయిన బట్టలు ఉతకడం ద్వారా జీవనం సాగించేవారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా వ్యవసాయం చేయాలని ఈ కుటుంబం నిర్ణయించుకుంది.

పాలకుర్తి సమీపంలోని మల్లంపల్లికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేయడం ప్రారంభించారు ఐలమ్మ దంపతులు. ఉత్తంరాజు జయప్రదాదేవిది దొరల కుటుంబం. అయితే, స్థానికంగా ఉన్న పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావు కుటుంబానికి, ఐలమ్మ కుటుంబానికి మధ్య ఘర్షణ తలెత్తింది.

అదే సమయంలో ఆ ప్రాంతంలో ఆంధ్ర మహాసభ అనే సంఘం ఏర్పడింది. అందులో ఐలమ్మ సంఘ సభ్యురాలిగా చేరింది. ఇవన్నీ నచ్చని పోలీస్ పటేల్ శేషగిరిరావు, ఐలమ్మను తన పొలంలో పని చేయమని ఒత్తిడి తెచ్చారు. అందుకు ఐలమ్మ నిరాకరించడంతో పటేల్ విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఐలమ్మకు కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయని రామచంద్రారెడ్డికి పోలీస్ పటేల్ శేషగిరిరావు చెప్పడంతో, ఐలమ్మ కుటుంబంపై, కమ్యూనిస్టు నేతలతోపాటు కేసు పెట్టారు. అయితే న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.

న్యాయస్థానంలో జరిగిన అవమానంతో రగిలిపోయిన పటేల్ శేషగిరిరావు, దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి.. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టి లొంగదీసుకోవాలని కుట్ర చేశారు. పోలీస్ పటేల్ సాయంతో రామచంద్రారెడ్డి, ఉత్తంరాజు జయప్రదాదేవి భూమిని తన పేరు మీద రాయించుకుని, భూమి తనదేనని, తన భూమిలో పండించిన ధాన్యాన్ని తీసుకుపోవడానికి తన మనుషులను ఐలమ్మ భూమిలోకి పంపారు. దీంతో ఆగ్రహించిన చాకలి ఐలమ్మ, రామచంద్రారెడ్డి పంపిన గుండాలపై తిరుగుబాటు చేసింది. రోకలిబండ చేత పట్టుకుని ఆ గుండాలను తరిమికొట్టింది. చాకలి ఐలమ్మ రామచంద్రారెడ్డిపై చేసిన తిరుగుబాటు తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిగా నిలిచింది. ఈ భూపోరాటం మొదలై, సాయుధ పోరాటానికి దారి తీసింది. నిజాం తొత్తులుగా ఉన్నవారి వద్ద నుంచి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగింది. ఈ సంఘటన తర్వాతే 'భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం' అనే నినాదం ఉద్భవించింది.

చాకలి ఐలమ్మ పోరాట ఫలితాలు ఇవే

ఉత్పత్తి కులంలో పుట్టిన చాకలి ఐలమ్మ ధైర్యంగా విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డిపై చేసిన భూపోరాటం తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని సంఘటనగా నిలిచింది. భూస్వామ్య వ్యవస్థలోని ఓ బలమైన నాయకుడిపై ఒక సామాన్య మహిళ చేసిన పోరాటంగా గుర్తింపు పొందింది. చాకలి ఐలమ్మ ధైర్యంతో అనేకమంది మహిళలు, ఉత్పత్తి కులాల వారు భూపోరాటంలో భాగస్వాములయ్యారు. తెలంగాణ తొలి భూపోరాట వీరురాలిగా చాకలి ఐలమ్మ పేరు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో లఖితమైంది..

చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన తర్వాత నిరాడంబర జీవితాన్ని గడిపారు. 10సెప్టెంబర్ 1985న ఆమె మరణించారు. ఆమె జయంతి, వర్ధంతిలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ తెలంగాణ అమరులను గుర్తు చేసుకునేలా ఘనంగా నిర్వహిస్తోంది.