Cell phone danger signal alert: దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులందరికీ మే 2, 2026న ఒకేసారి అత్యవసర హెచ్చరిక సందేశాలు రానున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), టెలికాం విభాగం (DoT) సంయుక్తంగా చేపడుతున్న సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగంగా ఈ సందేశాలను పంపనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ వినూత్న వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకే ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనని ప్రభుత్వం ముందస్తుగా అందరికీ సమాచారం పంపుతోంది.

ఏమిటీ సెల్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ?

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సెకన్ల వ్యవధిలో లక్షలాది మందిని అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. సాధారణ ఎస్ఎంఎస్ పంపడానికి నెట్‌వర్క్ సామర్థ్యం సరిపోకపోయినా, ఈ సెల్ బ్రాడ్‌కాస్ట్ సాంకేతికత ద్వారా ఒకేసారి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని ఫోన్లకు సందేశం చేరుతుంది. దీని కోసం వినియోగదారులకు ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిన అవసరం లేదు. సెల్ టవర్ల పరిధిలోని ప్రతి హ్యాండ్‌సెట్‌కు ఈ హెచ్చరిక నేరుగా వెళ్తుంది.

టెస్ట్ అలర్ట్ ఎలా ఉంటుంది?

రేపు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ క్షణంలోనైనా మీ ఫోన్‌కు ఈ టెస్ట్ మెసేజ్ రావచ్చు. ఈ సందేశం వచ్చినప్పుడు మీ మొబైల్ ఫోన్ బిగ్గరగా బీప్ శబ్దం చేస్తూ వైబ్రేట్ అవుతుంది. ఫోన్ స్క్రీన్‌పై NDMA will test Cell Broadcast Alerts... అనే సందేశం కనిపిస్తుంది. ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ హెచ్చరికలు వస్తాయి. ఈ మెసేజ్ చూడగానే మీరు ఎటువంటి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన పని లేదు.

ముందస్తు అప్రమత్తతే లక్ష్యం

వరదలు, భూకంపాలు, సునామీలు లేదా భారీ తుపాన్ల వంటి విపత్తులు సంభవించే ముందే ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సాచెట్ అనే ఇంటిగ్రేటెడ్ అలర్ట్ పోర్టల్‌ను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. గతంలో సుమారు 134 బిలియన్ల ఎస్ఎంఎస్ హెచ్చరికలను ప్రభుత్వం పంపినప్పటికీ, సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.

Your phone might buzz—but there’s no need to worry.

India is testing its indigenous Cell Broadcast System to enable instant, geo-targeted disaster alerts across the country.

You may receive test messages in English, Hindi & regional languages, if test channel is enabled in your… pic.twitter.com/NoIJdpJwIk

— DoT India (@DoT_India) April 29, 2026

ప్రజలకు విజ్ఞప్తి

ఈ మొబైల్ హెచ్చరికలు కేవలం వ్యవస్థ పనితీరును సరిచూడటానికేనని, ఎవరూ భయాందోళనలకు గురికావద్దని ఎన్‌డీఎంఏ కోరింది. ఒకవేళ మీ ఫోన్‌లో వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ సెట్టింగ్ ఆన్‌లో ఉంటేనే ఈ పరీక్షా సందేశాలు అందుతాయి. భవిష్యత్తులో నిజమైన ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ వ్యవస్థ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.