CBSE Sudden Checking In Schools And Found Dummy Students: దేశంలోని పలు పాఠశాలల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, బెంగుళూరు, వారణాసి, బీహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ల్లోని 29 స్కూళ్లల్లో 'డమ్మీ' విద్యార్థుల నమోదును పరిశీలించేందుకు బుధ, గురువారాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ అంశంపై సీబీఎస్ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా మాట్లాడారు. సీబీఎస్ఈ ఆఫీసర్, అనుబంధ పాఠశాల ప్రిన్సిపాల్‌తో కూడిన 29 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయన్నారు. అనేక స్కూళ్లల్లో వాస్తవిక హాజరు రికార్డులకు మించి విద్యార్థులను ఎన్‌రోల్ చేయడం ద్వారా బోర్డు నిబంధనలను వారంతా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. అలాగే, మౌలిక సదుపాయాల కల్పన విషయంలోనూ అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.

నిబంధనలు పాటించకపోవడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణించి.. ఆయా పాఠశాలలకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు హిమాన్షు గుప్తా వెల్లడించారు. చట్టపరమైన చర్యలు తీసుకుని అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలల జాబితాలో ఢిల్లీలోనే 18 ఉండగా.. వారణాసిలో 3, బెంగుళూరు, పాట్నా, అహ్మదాబాద్, బిలాస్‌పుర్‌ల్లో 2 చొప్పున ఉన్నాయని చెప్పారు. కాగా.. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే అనేక మంది విద్యార్థులు డమ్మీ స్కూళ్ల వైపు ఆసక్తి చూపుతుంటారు. రెగ్యులర్‌గా తరగతులకు వెళ్లకుండా నేరుగా బోర్డు పరీక్షలకే హాజరై.. తమ ఫోకస్ అంతా పోటీ పరీక్షలపైనే పెట్టేలా ఈ స్కూళ్లు విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంటాయి. వీటిపైనే సీబీఎస్ఈ చర్యలకు సిద్ధమవుతోంది.

Also Read: Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు