ప్రపంచంలో అతి పెద్ద మతం రోమన్ క్యాథలిక్. క్రైస్తవుల్లో క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు అని రెండు వర్గాలు ఉంటాయి. అయితే, చాలా విషయాల్లో ప్రొటెస్టెంట్లు క్యాథలిక్ సిద్ధాంతాలను కొన్నింటిని వ్యతిరేకిస్తారు. అలా ప్రొటెస్టెంట్లు వ్యతిరేకించిన విషయాల మీదే ఇటీవలే నూతనంగా ఎన్నికయిన పోప్ లియో XIV ఆధ్వర్యంలో పనిచేసే డికాస్టరీ ఫర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది ఫెయిత్ (DDF) నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ రెండు ముఖ్య టైటిల్స్‌ ఏంటి? వాటిని ఎందుకు పోప్ వాడవద్దని ఆదేశించారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

DDF వాడవద్దంటున్న టైటిల్స్ ఇవే...

వాటికన్ సిటీలో డికాస్టరీ ఫర్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది ఫెయిత్ (DDF) అనే వ్యవస్థ క్యాథలిక్కుల విశ్వాస సిద్ధాంతాలపైన పని చేస్తుంది. ఏ సిద్ధాంతాలను అమలు చేయాలి, ఈ సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చే బైబిల్ వాక్యాలు ఏంటి, లేదా ఒక సిద్ధాంతాన్ని వ్యతిరేకించే లేదా ఖండించే బైబిల్ వాక్యాలు ఏంటి అని ఈ DDF చర్చిస్తుంది. ఆ తర్వాతే విశ్వాస సిద్ధాంతాలను రూపకల్పన చేయడం ఈ విభాగం పని. అయితే, నవంబర్ 4వ తేదీన మరియమ్మ (Mary) బిరుదులపై "Mater Populi Fidelis" ("విశ్వాసపాత్రులైన దేవుని ప్రజల తల్లి") అనే సిద్ధాంత పత్రాన్ని విడుదల చేశారు. ఈ డాక్యుమెంట్‌లో DDF, మరియమ్మ గురించి తరచుగా ఉపయోగించే రెండు వివాదాస్పద బిరుదుల (Titles) వాడకాన్ని అనుమతించలేమని (Nixes) స్పష్టం చేసింది. అందులో మొదటిది'కో-రిడెంప్ట్రిక్స్' (Co-Redemptrix) . మరియమ్మను 'సహ-విమోచకురాలు'గా పేర్కొనడం సరైనది కాదని DDF పేర్కొంది. ఇక రెండవ బిరుదు విషయానికి వస్తే 'మీడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్' (Mediatrix of All Graces). ఈ బిరుదుకు కూడా సరియైన అర్థాన్ని వివరించడానికి తరచుగా వివరణలు అవసరమవుతున్నందున, దీన్ని వాడవద్దని సూచించింది.
దీని బదులు 'దేవుని తల్లి' (Mother of God) మరియు 'విశ్వాసపాత్రులైన ప్రజల తల్లి' (Mother of the Faithful People of God) వంటి బిరుదులను ఉపయోగించమని సూచనలు చేసింది.

ఈ రెండు బిరుదులను వాడవద్దనడానికి కారణాలు ఇవే

DDF ఈ రెండు బిరుదులను వాడడానికి నిరాకరించడానికి గల ప్రధాన కారణం, అవి యేసు క్రీస్తు (Jesus Christ) యొక్క ప్రత్యేకమైన పాత్రను మరుగుపరుస్తాయనే సిద్ధాంతపరమైన (Doctrinal) ఆందోళనే ప్రధాన కారణం.

1. 'కో-రిడెంప్ట్రిక్స్' (Co-Redemptrix): 'కో-రిడెంప్ట్రిక్స్' అంటే 'సహ-విమోచకురాలు' అని అర్థం. పాపం నుండి ప్రజలను విడిపించి మోక్షాన్ని అందించడంలో యేసు క్రీస్తు ఒక్కరే ఏకైక విమోచకుడు (Sole Redeemer), మధ్యవర్తి (Mediator) గా బైబిల్ చెబుతోంది. ఈ బిరుదను మరియమ్మకు వాడటం వల్ల ఆమెను యేసు క్రీస్తుతో పాటు సమానంగా విమోచన కార్యంలో భాగం అయినట్లు భక్తులు భావించే ప్రమాదం ఉందని DDF పేర్కొంది. క్యాథలిక్ సిద్ధాంతం ప్రకారం, యేసు క్రీస్తు త్యాగం ద్వారానే పాప విమోచన, మోక్ష ప్రాప్తి సాధ్యం. మరియమ్మ కేవలం ఈ కార్యంలో సహకరించారే తప్ప, సమానమైన భాగస్వామ్యం లేదు. కాబట్టి 'కో-రిడెంప్ట్రిక్స్' అంటే 'సహ-విమోచకురాలు' అన్న టైటిల్ మరియమ్మకు వాడకూడదని వాటికన్ సిటీ ఆదేశించింది.

2. 'మీడియాట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్': ఈ టైటిల్‌కు 'అన్ని వరాల/అనుగ్రహాల మధ్యవర్తి' అని అర్థం. క్యాథలిక్ సిద్ధాంతం ద్వారా యేసు క్రీస్తు, పవిత్రాత్మ ద్వారానే భక్తులకు ఆయా వరాలు, దీవెనలు ప్రాప్తిస్తాయి. కానీ ఈ టైటిల్ వాడటం వల్ల మరియమ్మ ద్వారా ఇవి భక్తులకు వస్తున్నట్లు అర్థం వచ్చే ప్రమాదం ఉందని వాటికన్ సిటీ వివరణ ఇచ్చింది. దీని వల్ల భక్తుల్లో గందరగోళం ఏర్పడుతుందని, అపార్థాలకు దారితీయవచ్చని వివరించింది.

ఇప్పటివరకు క్యాథలిక్కులు యేసు క్రీస్తుతో పాటు ఆయన తల్లియైన మరియమ్మకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంలో క్యాథలిక్కులను ప్రొటెస్టెంట్లు వ్యతిరేకిస్తారు. ఈ రెండు బిరుదులను వాడకూడదని క్యాథలిక్ భక్తులకు వాటికన్ సిటీ నుండి ఆదేశాలు రావడం పట్ల ప్రొటెస్టెంట్లు సైతం ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం.