Union Budget 2026: ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం మూలధన వ్యయాన్ని రూ. 12.4 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది.

ద్రవ్య లోటు కట్టడి.. ఆర్థిక క్రమశిక్షణే లక్ష్యం

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, వచ్చే ఏడాది అమలులోకి రానున్న పే-కమిషన్ సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించే అవకాశం ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును జీడీపీలో 4.2 నుంచి 4.4 శాతం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూబీఐ పేర్కొంది. అంతేకాకుండా, 2031 నాటికి రుణ-జీడీపీ నిష్పత్తిని 50 శాతానికి తగ్గించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో కేంద్రం అడుగులు వేస్తోంది.

కీలక రంగాలకు పెద్దపీట

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం తన వ్యయాన్ని కొనసాగించనుంది. జీడీపీలో దాదాపు 3.2 శాతానికి సమానమైన రూ. 12.4 లక్షల కోట్లను మూలధన వ్యయం కింద కేటాయించవచ్చు. ఇందులో రక్షణ రంగం, జాతీయ రహదారుల నిర్మాణం , రైల్వే వ్యవస్థ ఆధునీకరణకు అత్యధిక ప్రాధాన్యత లభించనుంది. జీఎస్టీ పరిహారం సెస్‌ నిలిపివేత వంటి ఆదాయ పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ, అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది.

పెట్టుబడుల ఆకర్షణ.. పన్నుల హేతుబద్ధీకరణ
బడ్జెట్‌లో కేవలం లెక్కలే కాకుండా కీలక సంస్కరణల ప్రకటనలు కూడా ఉండవచ్చని యూబీఐ నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా..

-బ్యాంకు డిపాజిట్లను మరింత ఆకర్షణీయంగా మార్చే చర్యలు.
-విదేశీ పెట్టుబడిదారులను (FDI) ప్రోత్సహించే విధానాలు.
-తయారీ రంగానికి ఊతమిచ్చేలా కస్టమ్స్ డ్యూటీ హేతుబద్ధీకరణ.
-రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు ఉండవచ్చు.

ఆర్థిక మంత్రి తన సంప్రదాయక శైలిలోనే విశ్వసనీయమైన బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే, మార్కెట్లకు ,సామాన్యులకు కొన్ని సానుకూల ఊహించని వరాలను అందించే అవకాశం ఉందని యూబీఐ నివేదిక వెల్లడిస్తోంది.