Union Budget 2025 May Announce New Schemes: మన దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక విధానాల వైఫల్యం కారణంగా ఎక్కువగా బాధపడుతున్నది ఎవరు అని ప్రశ్నిస్తే, మధ్య తరగతి వర్గం అనే సమాధానం ఠక్కున వస్తుంది. భారత్‌లో ధనికులు & పేదలతో పోలిస్తే మధ్య తరగతి ప్రజలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. అంటే, మనది మిడిల్‌ క్లాస్‌ సొసైటీ. బడ్జెట్‌ ప్రతిపాదనలు సహా ప్రభుత్వ పరంగా తీసుకునే ఏ నిర్ణయమైనా మొదట ప్రభావం చూపేది మధ్య తరగతి జనం మీదే.

మెజారిటీ పోర్షన్‌లో ఉన్న ఈ మిడిల్‌ క్లాస్‌ సొసైటీ నిరంతరం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. కామన్‌మేన్‌ జేబులకు పడుతున్న చిల్లులను కొంతమేర అయినా భర్తీ చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం, నిర్మలమ్మ తన బడ్జెట్‌లో కొన్ని ప్రత్యేక పథకాలను ప్రకటించవచ్చు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే, రూ. 15-20 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు బడ్జెట్‌లో పన్ను తగ్గింపులను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారిపై పన్ను విధిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, భారత ప్రభుత్వం పన్నులను తగ్గించే విషటాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ పన్ను తగ్గింపు ఉద్దేశ్యం మధ్య తరగతి సమాజ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం.

స్టాండర్డ్ డిడక్షన్‌
ఉద్యోగులకు పాత పన్ను విధానంలో రూ. 50,000 & కొత్త పన్ను విధానంలో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ (Standard deduction) వర్తిస్తుంది. ద్రవ్యోల్బణంతో మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, స్టాండర్డ్ డిడక్షన్‌ను మరింత పెంచాలనే డిమాండ్ ఉంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించవచ్చు. అదేవిధంగా, సీనియర్ సిటిజన్లకు కూడా ప్రత్యేక ఉపశమనం కలిగించే ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవచ్చు. దీని కోసం వివిధ స్థాయుల్లో డిమాండ్లు కూడా వినిపించాయి. ఇటీవలి కాలంలో సర్కారు తీసుకున్న కొన్ని చర్యలను బట్టి, సీనియర్ సిటిజన్ల కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైనా చేయగలదని భావిస్తోందని అర్ధం అవుతోంది. పాత పన్ను విధానంలో సీనియర్ సిటిజన్లకు రూ. 2.5 లక్షలు, కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు రాయితీ ఉంది. దీనిని పాత విధానంలో రూ. 7 లక్షలకు, కొత్త విధానంలో రూ. 10 లక్షలకు పెంచవచ్చు.

గృహ రుణంపై వడ్డీకి మినహాయింపు
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24B కింద, గృహ రుణం వడ్డీపై రూ. 3 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించవచ్చు. ఇది కాకుండా, ప్రధాన రుణ మొత్తంపై మినహాయింపు కోసం కొత్త కేటగిరీని సృష్టించవచ్చు. ఇప్పుడు, సెక్షన్ 24B కింద, గృహ రుణంపై రూ. 2 లక్షల వడ్డీపై మాత్రమే మినహాయింపు పొందే నిబంధన ఉంది. అసలు చెల్లింపులో మినహాయింపు సెక్షన్‌ 80C కిందకు వస్తుంది.

ఆరోగ్య బీమా
హెల్త్ పాలసీ ప్రీమియంపై తగ్గింపు పరిమితిని 60 ఏళ్ల లోపు వ్యక్తులకు రూ. 50,000 కు, సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్ల వయస్సు నిండినవాళ్లు) రూ. 75,000 వేలకు పెంచవచ్చు.

మరో ఆసక్తికర కథనం: భారత్‌లోనూ ఒక బ్లాక్‌ బడ్జెట్‌ - ఎవరు, ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెట్టారో తెలుసా?