BRS leaders says tapping is not a crime: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణకు వెళ్లిన సమయంలో బీఆర్ఎస్ నేతలు వరుసగా ప్రెస్మీట్లు పెట్టి ట్యాపింగ్ నేరం కాదని వాదిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ అగ్రనేతలు మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నేరం కాదని, దేశ భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఉపయోగించే నిఘా అని వారు స్పష్టం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచి నేటి ప్రధాని మోదీ వరకు ప్రతి ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను వినియోగించుకుంటుందని గుర్తు చేశారు.

మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసు వ్యవస్థకు సంబంధించిన అంశమని, దీనిలో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిఘా వర్గాలు చేసే విచారణను రాజకీయ కోణంలో చూడటం సరికాదని హితవు పలికారు. కేవలం బీఆర్ఎస్ నేతలను వేధించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పాత అంశాలను తెరపైకి తెస్తోందని, సిట్ విచారణ పేరుతో డ్రామాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారని గుర్తుచేశారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని రతన్ టాటా చెబితే.. 9 వేల ఫోన్లు ట్యాప్ చేశామని మన్మోహన్ సింగే చెప్పారని గుర్తుచేశారు. ప్రతిరోజు కొన్ని మెయిల్స్‌ను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్‌ ప్రక్రియ గోప్యంగా జరుగుతుందని తెలిపారు. హోంమంత్రి, సీనియర్ ఐపీఎస్‌లకు కూడా ఎస్‌ఐబీ ఎక్కడ ఉంటుందో తెలియదని అన్నారు. ఫలానా విధంగా సమాచారం సేకరించినట్లు ప్రధాని, ముఖ్యమంత్రికి కూడా చెప్పరని తెలిపారు. అందుకే ఢిల్లీలో కూడా ఫోన్ ట్యాపింగ్‌పై చర్చ జరగడం లేదన్నారు. తన రాజకీయ కక్షలకు ట్యాపింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడని మండిపడ్డారు.

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , గొంగిడి సునీత వంటి ఇతర నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి వివాదాలను సృష్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం వంటి అంశాలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులను లక్ష్యంగా చేసుకుని నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వారు ధ్వజమెత్తారు.

కేసులో నిజాయితీ ఉంటే ముందుగా ఉన్నత స్థాయి పోలీసు అధికారులను ఎందుకు విచారించడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. కేవలం రాజకీయ నేతలను పిలిచి గంటల తరబడి విచారించడం అంటే వారిని మానసికంగా వేధించడమేనని అభిప్రాయపడ్డారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెబుతూనే.. అక్రమ కేసులతో తమ గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు.