<p>హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. జనవరిలో జరిగిన సమావేశాల్లో మూసీ డీపీఆర్ (DPR) తయారీకి 18 నెలలు పడుతుందని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు మార్చి బడ్జెట్ సమావేశాల నాటికే డీపీఆర్ సిద్ధమైందని ఎలా చెబుతోందని ఆయన ప్రశ్నించారు. </p>
<p>మూసిలో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.. అందుకే ఈ అంశం పై సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారీ బాధ్యతలను అప్పగించిన 'మెయిన్ హార్ట్' (Meinhardt) సంస్థపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ వంటి దేశాల్లో నిషేధానికి గురైన మరియు అనేక కేసుల్లో ఇరుక్కున్న బ్లాక్ లిస్ట్ సంస్థకు ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఎలా అప్పగిస్తారని ఆయన నిలదీశారు. అటు ఏడీబీ (ADB) సంస్థ కూడా తాము మూసీపై ఎలాంటి డీపీఆర్ ఇవ్వలేదని లేఖ రాయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఒకవైపు ముఖ్యమంత్రి లక్షన్నర కోట్లు ఖర్చు అవుతుందని, మరోవైపు 4 వేల కోట్లు అని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు.</p>
<p>ప్రభుత్వ గెజిట్ ప్రకటనలకు, మంత్రుల మాటలకు అస్సలు సంబంధం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. అసలు డీపీఆర్ లేకుండానే 1,400 నిర్మాణాలను ఎలా గుర్తించారని ఆయన ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ గందరగోళంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అవినీతికి ఆస్కారం ఇచ్చేలా బ్లాక్ లిస్ట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడంపై క్లారిటీ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.</p>