BRS MLAs Disqualification Case | హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇదివరకే నలుగురు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తికాగా, మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారించనున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం తెలిసిందే. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఏడాదిన్నర కిందటే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం 3 నెలల్లోగా విచారణ పూర్తిచేసి నిర్ణయం వెల్లడించాలని జూలై 31న తీర్పునిచ్చింది.

నలుగురు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి, తాజాగా మరో నలుగురి విచారణ
అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల విచారణను పూర్తిచేశారు. ఈ నెల 6 నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. విచారణ జరగనున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, డాక్టర్‌ సంజయ్‌. ఈ నెల 6న తెల్లం వెంకట్రావ్, సంజయ్‌ పిటిషన్లను విచారించనున్నారు. ఈ 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ విచారించనున్నారు. ఈ నెల 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ పిటిషన్లపై రెండోసారి విచారణ జరపనున్నారు. ఈ 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆరికెపూడి గాంధీల పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు.

సుప్రీంకోర్టును గడువు పొడిగింపు కోరిన స్పీకర్ కార్యాలయం
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల గడువు గత నెల 31న ముగిసింది. ఈ క్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్‌ కార్యాలయం 4 రోజుల క్రితం పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణకు మరో 2 నెలల గడువు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయిందని, పలు కారణాలతో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సరిపోలేదని స్పీకర్‌ ఆఫీసు దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.