హైదరాబాద్: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌పై బిఆర్ఎస్ (BRS) దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేస్తూ, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ కుమార్ పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని, ఆయన సాంకేతికంగా ఇప్పటికీ బిఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి వేసిన అనర్హతా పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ ఎమ్మెల్యే సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.

ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిన స్పీకర్, సుప్రీంకోర్టు గడువు లోపే తన నిర్ణయాన్ని వెలువరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, తాను పార్టీ జెండా కప్పుకోలేదని ఎమ్మెల్యే చేసిన వాదనను స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ కేసుతో పాటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ అనర్హత వేటు వేయాలని కోరగా, ఇప్పటివరకు సంజయ్ కుమార్‌తో కలిపి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య వంటి నేతలపై కూడా ఇలాంటి తీర్పే వెలువడింది. అయితే, ఈ నిర్ణయాలపై బిఆర్ఎస్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచే గెలిచా.. ఆ పార్టీలోనే కొనసాగుతా: ఎమ్మెల్యే సంజయ్

తన వేతనం నుంచి ప్రతినెలా రూ.5 వేలు బీఆర్ఎస్ కోసం వెళ్తాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు విప్ జారీ చేస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతా అన్నారు.