Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలుడు సహా ముగ్గురు దుర్మరణం

విజయనగరం మండలం చెల్లూరు సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయగడ దైవదర్శనానికి వెళ్తున్న 16 మంది ప్రయాణికుల వ్యాన్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి, 500 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బొచ్చపేటకు చెందిన రాంబాబు (50), నారాయణరావు (50), మోహననాయుడు (8) అక్కడికక్కడే మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు మహారాజా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అనారోగ్యంతో సీనియర్ నటి పావలా శ్యామల మృతి

ప్రముఖ సీనియర్ సినీనటి పావలా శ్యామల (75) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించిన ఆమె నాటక రంగం ద్వారా నటనలోకి అడుగుపెట్టారు. బాబాయ్ అబ్బాయ్, స్వర్ణకమలం, ఖడ్గం తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో బాధపడగా పలువురు సినీ ప్రముఖులు సాయమందించారు.