Where is The Black Taj Mahal | ఆధునిక ప్రపంచ వింతల్లో వింతల్లో 'తాజ్ మహల్ ' కు ఉన్న ప్రత్యేకతే వేరు. తన భార్య 'ముంతాజ్ 'మీద ఉన్న ప్రేమతో షాజహాన్ చక్రవర్తి కట్టించిన ప్రేమ చిహ్నంగా తాజ్ మహల్ ఎంతో పేరు తెచ్చుకుంది. అయితే తెల్లటి పాలరాయితో కట్టిన తాజ్ మహల్ తో పాటే తన సమాధి కోసం నల్లటి రాయితో " "బ్లాక్ తాజ్ మహల్ "ని కూడా కట్టాలని షాజహాన్ చక్రవర్తి అనుకున్నాడా. దానికోసం కొన్ని ప్రయత్నాలు చేసి ఆపేశారా? చరిత్ర ఏం చెబుతోంది..!

యమునా నదికి అవతలి వైపున "బ్లాక్ తాజ్ మహల్ "

1665లో ఆగ్రాను సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు 'జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ ' తొలిసారి ఈ బ్లాక్ 'తాజ్ మహల్' గురించి తన రచనల్లో పేర్కొన్నారు. తన భార్య కోసం కట్టిన పాలరాతి తాజ్ మహల్ కి ఎదురుగా యమునా నదికి అవతలి ఒడ్డున "బ్లాక్ తాజ్ మహల్ " ని కట్టుకోవాలని "షాజహాన్ చక్రవర్తి " ప్రయత్నాలు ప్రారంభించారని కానీ ఈ లోపు ఆయన కుమారుడు " ఔరంగజేబ్ " తిరుగుబాటు చేసి షాజహాన్ చక్రవర్తిని ఆగ్రా కోట లో బందీగా చేయడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది అని 'టావెర్నియర్' తన రచనల్లో పేర్కొన్నారు. ఆయన ఆగ్రాను సందర్శించేసరికి 'షాజహాన్' తనకోటలోనే బందీగా ఉన్నారు. బ్లాక్ తాజ్ మహల్ నిర్మాణం కోసం తెచ్చిన నల్ల పాల రాయి ముక్కలు యమునా నదికి అవతల వైపున తాజ్ మహల్ కి ఎదురుగా ఇంకా ఉన్నట్టు కూడా ఆయన పేర్కొన్నారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా " బ్లాక్ తాజ్ మహల్ " అన్నది పాపులర్ అయింది. ప్రస్తుతం ఉన్న తాజ్ మహల్ కోసం విపరీతంగా షాజహాన్ ఖర్చుపెట్టడం కూడా ఔరంగ్ జేబు తిరుగుబాటుకు ఒక కారణంగా 'టావెర్నియర్' పేర్కొన్నారు.

'తాజ్ మహల్ ' కోసం 3500 కోట్ల ఖర్చు

తన ఎంతో ప్రేమించే భార్య " ముంతాజ్" చనిపోవడంతో ఆమె సమాధి కోసం " షాజహాన్ చక్రవర్తి" 1631 లో తాజ్ మహల్ కట్టడం ప్రారంభించాడు. 1648 నాటికి తాజ్ మహల్ నిర్మాణం పూర్తయింది. మరో 5 ఏళ్లపాటు తాజ్ మహల్ చుట్టూ ఉన్న ఉద్యానవనాలు, ఇతర చిన్న చిన్న కట్టడాల నిర్మాణం కొనసాగింది. 'తాజ్ మహల్ ' ని నిర్మించడం కోసం షాజహాన్ పెట్టిన ఖర్చు ఆ రోజుల్లోనే 50 లక్షల రూపాయలు. ప్రస్తుత లెక్కల ప్రకారం దాని విలువ 3500 కోట్ల పై మాటే. 'ఇండో ఇస్లామిక్ స్టైల్లో ' కట్టిన తాజ్ మహల్ ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీన్ని చూడడం కోసం దేశ విదేశాల నుంచి యాత్రికులు ఆగ్రాకు వచ్చేవారు. తాజ్ మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత 'ముంతాజ్ బేగం ' అవశేషాలను తాజ్ మహల్ లో ఖననం చేసారు. దీని తర్వాత తనకోసం " నల్ల తాజ్ మహల్ " కట్టాలని షాజహాన్ అనుకున్నారు అనే ప్రచారం చాలామందిలో ఉంది.

'టావెర్నియర్' రచనల్లో నిజం ఎంత?

'టావెర్నియర్' రచనలను బేస్ చేసుకొని 'నల్ల తాజ్ మహల్ ' ఆధారాల కోసం చరిత్రకారులు చాలా ప్రయత్నించారు. యమునా నది ఒడ్డునే ఉన్న నల్ల పాలరాయి అవశేషాలు బ్లాక్ తాజ్ మహల్ కోసం తెచ్చినవే అని చాలాకాలం భావించారు. కానీ అవి మామూలు పాలరాయి అవశేషాలే అని కాల గమనంలో పట్టించుకోక అవి నల్లగా మారిపోయాయని తేల్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని 'మెహె తాబ్ బాగ్ " పేరుతో గార్డెన్ గా మార్చేశారు. ' బ్లాక్ తాజ్ మహల్ ' అనేది కేవలం ఒక లెజెండ్ మాత్రమే అని షాజహాన్ అటువంటి ప్రయత్నం చేయలేదను అనీ.. దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఆ ప్రాంతంలో దొరకలేదని చరిత్రకారులు చెబుతారు.దానితో ఈ "బ్లాక్ తాజ్ మహల్ " అనేది ఒక పుక్కిట పురాణం గానే కొట్టి పారేస్తుంటారు చరిత్ర కారులు.

" బ్లాక్ తాజ్ మహల్ " నిజంగానే ఉంది.. కానీ ఆగ్రాలో కాదు..

చారిత్రకంగా చూస్తే " బ్లాక్ తాజ్ మహల్ " నిజంగానే ఉంది. మధ్యప్రదేశ్ లోని 'బురంపూర్ ' లో మొగల్ సుబేదార్ "షా నవాజ్ ఖాన్ " 44 ఏళ్ల వయస్సులో యుద్ధంలో పోరాడుతూ చనిపోయాడు. ఆయన తండ్రి కొడుకు సమాధి కోసం 1619లో నల్లటి రాయితో ఒక నిర్మాణాన్ని కట్టాడు. 'షాజహాన్ ' 1628లో మొఘల్ చక్రవర్తి అయ్యాక ' బురంపూర్' నుండే దక్కన్ పై పోరాటం చేసాడు. అతనితోపాటు అతని భార్య ముంతాజ్ కూడా ప్రయాణాలు చేసేది. ఇలాంటి సందర్భంలోనే ఆమె 14వ బిడ్డకు జన్మనిస్తూ 1631లో బురంపూర్ లోనే మృతి చెందింది. ఆమెను ఆరు నెలలపాటు ఇక్కడే సమాధి చేసి ఉంచారు. ఆ సమయంలో నవాజ్ ఖాన్ సమాధిని చూసిన షాజహాన్ "తాజ్ మహల్ " నిర్మాణం కోసం ఆ కట్టడాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని చరిత్రకారుడు మహమ్మద్ నౌషాద్ చెబుతారు.

మొదట తాజ్ మహల్ ను అక్కడే కట్టాలనుకున్నారని అయితే అంత భారీ కట్టడాన్ని ఇక్కడ నేల ఆపలేదని ఆగ్రా లోనే నిర్మాణం మొదలుపెట్టారని అని అంటారు. తాజ్ మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత "బురంపూర్"లోని నవాజ్ ఖాన్ సమాధిని 'కాలా తాజ్ మహల్ ' లేదా " బ్లాక్ తాజ్ మహల్ "అని పిలవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అది కూడా ఒక పెద్ద టూరిస్ట్ ఎట్రాక్షన్ గా మారింది.