హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ పీక్స్ కు చేరింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్న సమయంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరుపులు, కేకలతో సభ దద్దరిల్లింది. బీఆర్ఎస్ నేతల అరుపులు, కేకలు లెక్క చేయకుండా భట్టి తన ప్రసంగం కొనసాగించారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పై భట్టి ఏమన్నారంటే.. నివేదికను ప్రజల ముందు ఉంచాలా, దాచి ఉంచాలా, రాజకీయ దురద్దేశ్యంతో వెళ్లాలని మేము ఆలోచించలేదు. నేరుగా సభలో కమిషన్ నివేదిక పెట్టాము. సభ ఏం చెబితే , అదే విధంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము. కమిషన్ నివేదికలో అధికారులపైనా ఆరోపణలు వచ్చాయన్నారు.

మాది పొలిటికల్ డ్రామా కాదు, ఇది సర్కస్ కంపెనీ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పటి సీఎం కేసీఆర్ చెబితే నాటి మంత్రి హరీష్ రావు కట్టారు. ఇంజనీర్లు చేయాల్సిన పనులు సీఎం, మంత్రులు చేస్తే ఇలా కాళేశ్వరంలా కుంగిపోతుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కృష్ణా, గోదావరి నదులపై ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులతోపాటు ఏ ప్రాజెక్టును వదిలిపెట్టకుండా, రీడిజైన్ పేరుతో వేల కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టారు. విపరీతంగా అంచనాలు పెంచి దోచుకున్నారు. కేవలం 1450 కోట్లతో అయ్యే ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టును 25వేల కోట్లకు అంచనాలు పెంచి దోచుకున్నారని ఆరోపించారు.

కాళేశ్వరం కమిషన్ పై అపవాదులు వేయడం బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని భట్టి విక్రమార్క హితవు పలికారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాకు కనీసం మైక్ ఇవ్వకపోయినా , ఇబ్బందిపెట్టినా భరించాం. మేం అలా చేయడంలేదు. మాట్లడేందుకు ప్రతిపక్షనేతలకు అవకాశం ఇస్తున్నాం. కేసీఆర్ కూడా సభకు రావాలి. కాళేశ్వరం నివేదికపై వివరణ ఇవ్వాలి. సభను తప్పుదోవ పట్టించేలా మాట్లడటం హరీష్ రావు మానుకోవాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రజల సొమ్ము దొపిడీకి గురైయ్యింది. ఓవైపు నీళ్లు లేవు, మరోవైపు కోట్లాది రూపాయలు వృధా ఖర్చు జరిగిందన్నారు.

సభలో కాగితాలు చించడంపై ఆగ్రహం..
కాళేశ్వరం కమిషన్ నివేదికను చెత్త బుట్ట అని హరీష్ రావు అనడం సరికాదు. చెత్తబుట్ట అంటే ఆ పార్టీని ఇప్పుడు ప్రజలు ఇక్కడ వేశారో అందరికీ తెలుసు అని భట్టి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పై ఏం చేద్దామో మాట్లడకుండా, ఇతర విషయాలు మాట్లడం సరికాదు. సభ దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. పదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఇచ్చిన అంశంపై మాట్లడకుండా మిగత అన్ని విషయాలు మాట్లాడటం మానుకోవాని కోరారు. సభను తప్పుదోవ పట్టిస్తూ నిరసలను చేయడం సరికాదన్నారు భట్టి విక్రమార్క. పోడియం వద్ద నిరసనలు చేయడం మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీలో కాగితాలు చించడంపై మండిపడ్డారు. మిగతా సభ్యులకు మాట్లడే అవకాశం ఉందని మర్చిపోతున్నారు. అందరూ మాట్లడే విధంగా అవకాశం ఇవ్వాలంటూ అసహనం వ్యక్తం చేశారు.