Tamil Director Actor Bharathiraja Death News: భారతీయ చిత్ర పరిశ్రమలో... తమిళ చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. తమిళనాట దర్శక శిఖరంగా పేరు పొందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు భారతీరాజా ఇకలేరు. కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

చెన్నైలో భారతీరాజా మృతి
భారతీరాజా వయసు 84 ఏళ్ళు. జూన్ 10, 2026న చెన్నైలో ఆయన కన్ను మూశారు. ఈ మరణ వార్త తమిళ చిత్రసీమ ప్రముఖులను, ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వృద్ధాప్యం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో కొంత కాలంగా భారతీరాజా బాధ పడుతున్నారు. చెన్నైలోని స్వగృహంలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు.

భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా గత ఏడాది మార్చిలో మృతి చెందారు. ఆ తర్వాత భారతీరాజా ఆరోగ్యం మరింత క్షీణించిందని సమాచారం. కుమారుడి మరణం ఆయనను మానసికంగా కృంగదీసిందని, ఆ విషాదం నుంచి కోలుకోవడం కష్టమైందని భారతీరాజా సోదరుడు జయరాజ్ ఒక సందర్భంలో తెలిపారు.

భారతీరాజా ఎక్కడ జన్మించారు?
సినిమాల్లో ఆయన ప్రత్యేకత ఏంటి?
జూలై 17, 1941న తమిళనాడులోని తేని జిల్లాలో భారతీరాజా జన్మించారు. ఆయన అసలు పేరు చిన్నసామి. '16 వయతినిలే' (తెలుగులో 'పదహారేళ్ళ వయసు'గా రీమేక్ చేశారు)తో దర్శకుడిగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి వరకు సినిమా అంటే స్టూడియో సెట్టింగులే అని, స్టూడియోలలో మాత్రమే సినిమాలు తీస్తారని - తీయగలరనే దృక్పథాన్ని మార్చి... పల్లెటూరి పచ్చని పొలాల మధ్యకు, సహజ సిద్ధమైన లొకేషన్లకు చిత్ర బృందాన్ని తీసుకు వెళ్లిన ట్రెండ్ సెట్టర్ భారతీరాజా.

పల్లెటూరి వాతావరణాన్ని, గ్రామీణ జీవితాన్ని, పల్లె ప్రజల మధ్యలో సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై సహజంగా - వాస్తవానికి దగ్గరగా ఆవిష్కరించడం భారతీరాజా స్టైల్. 'అలైగళ్ ఓవతిల్లై', 'మన్ను వాసనై', 'ముతల్ మరియాదై' వంటి సినిమాలు ఆయన క్రియేటివిటీకి అద్దం పట్టాయి.

Also Read:

తమిళ చిత్రసీమకు మాత్రమే భారతీరాజా పరిమితం కాలేదు. తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలు తీశారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన 'సీతాకోక చిలుక' సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకుంది. కుల వివక్ష, సామాజిక సమస్యలను సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడం భారతీరాజా ప్రత్యేకత. సినిమాల ద్వారా ప్రజల్లో ఎంతో అవగాహన, మార్పు తీసుకు వచ్చిన ఆయనను భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

Also Read:

నటుడిగానూ తనదైన ముద్రవేసిన భారతీరాజా
దర్శకుడిగా మాత్రమే కాదు... నటుడిగానూ తన ముద్ర వేశారు భారతీరాజా. తమిళ సినిమాలు 'పాండియనాడు', 'కురంగు బొమ్మై', 'తిరు చిత్రాంబలం' (తెలుగులో 'తిరు'గా విడుదలైంది), 'మహారాజా' (తెలుగులోనూ సేమ్ టైటిల్)లో ఆయన నటనకు ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి. ఆయన నటించిన తమిళ సినిమా 'పులవర్' ఇంకా విడుదల కాలేదు. కార్తీక్, రాధ, రేవతి వంటి తారలను వెండితెరకు పరిచయం చేసిన ఘనత భారతీరాజాదే. ఆయన మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు అని పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

Also Read: