బెంగళూరులో ఘోరం: 'వెస్ట్రన్ స్టైల్' ప్రపోజల్ అంటూ ప్రియుడిని సజీవ దహనం చేసిన ప్రియురాలు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం మధ్యాహ్నం ఒక దారుణం జరిగింది. వెరైటీగా ప్రపోజ్ చేస్తున్నానని తన ప్రేమికుడ్ని ఓ యువతి నమ్మించి అత్యంత కిరాతకంగా నిప్పు పెట్టి సజీవ దహనం చేసింది. ఈ దారుణ హత్య ప్లాన్ ప్రకారం చేసినట్లు బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. అంజనానగర్‌లోని బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని కిరణ్‌(28)గా గుర్తించారు.

వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానంటూ ఊరించి దారుణం..
నిందితురాలు ప్రేమ, కిరణ్‌ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. తాను వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని కిరణ్‌ను నమ్మించింది. అందులో భాగంగానే అతడి కళ్లకు గంతలు కట్టి, కాళ్లు చేతులను సైతం తాడుతో కుర్చీకి గట్టిగా కట్టేసింది. ఎందుకు ఇలా చేస్తున్నావని కిరణ్ పదే పదే ప్రశ్నించగా, ఇదంతా ప్రపోజల్ లో భాగంగా చేస్తున్నట్లు నమ్మించింది. ఆ తర్వాత అతనిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తీవ్రమైన కాలిన గాయాలతో కిరణ్ అక్కడికక్కడే మరణించాడు. హత్యకు ముందే ఆమె తన వద్ద పెట్రోల్ సిద్ధంగా ఉంచుకుందని, ఇది పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యగా బ్యాడరహల్లి పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఘోరాన్ని ఆమె తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిందని తెలుస్తోంది.

ప్రేమ వ్యవహారమే కారణమా?
తాజాగా హత్యకు గురైన కిరణ్, ప్రేమ ఇద్దరూ రాజాజీనగర్‌లోని ఒక స్టోర్‌లో కలిసి పనిచేసేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత కొంతకాలం నుంచి కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, ప్రేమ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో మంగళవారం నెలమంగళలో కొత్త వి కనెక్షన్ పని కోసం కిరణ్ ఆమెను పికప్ చేసుకున్నాడు. అనంతరం వారిద్దరూ గద్దె ఖాన్ ప్రాంతంలోని ఆమె ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు అతడితో ప్రేమగా మాట్లాడింది. తరువాత వెరైటీగా ప్రపోజ్ చేస్తానని నమ్మించి కూర్చీలో కూర్చోబెట్టి కాళ్లు, చేతులు కట్టేసి.. కళ్లకు సైతం గంతలు కట్టింది. ప్రపోజ్ చేస్తుందని ఆశగా చూస్తున్న కిరణ్‌పై ఒక్కసారిగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది.

నిందితురాలు అరెస్ట్..

ఏసీపీ అశోక్, ఇన్స్‌పెక్టర్ భాస్కర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కిరణ్ తన ఇంటికి పెట్రోల్ తీసుకొచ్చాడని, తనతో గొడవపడి నిప్పింటించేందుకు ప్రయత్నించాడని పోలీసుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే సీసీ ఫుటేజీ పరిశీలించగా అక్కడ వారిద్దరూ గొడవపడలేదని, ప్లాన్ ప్రకారం యువతి తన ప్రియుడ్ని హత్య చేసిందని గుర్తించారు. తనను దూరం పెడుతున్నాడని, తనపై ప్రేమ తగ్గిపోయిందని.. మోసం చేస్తున్నాడని భావించి ఈ పని చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం నిందితురాలు ప్రేమను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని డీసీపీ (నార్త్ వెస్ట్) డి.ఎల్. నగేష్ తెలిపారు.