బెంగళూరు: బెంగళూరులోని హెచ్‌ఏఎల్ (HAL) పరిధిలో ఉన్న క్యాప్‌జెమిని క్యాంపస్ లోని డేకేర్ సెంటర్‌లో పిల్లలపై వేధింపుల ఆరోపణల కేసులో సుజాత, విజయలక్ష్మి అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (KSCPCR) శనివారం తెలిపింది. చైల్డ్ హెల్ప్‌లైన్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా జూన్ 25 రాత్రి హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చిందని కెఎస్‌సిపిసిఆర్ చైర్‌పర్సన్ సంతోష్ కుమార్ సి తెలిపారు. మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన నివేదికల ఆధారంగా, కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి నివేదికను కోరింది.

అసలు వివాదం ఏంటీ..
క్యాప్‌జెమిని క్యాంపస్‌లోని కేర్‌టేకర్లు పసిపిల్లలను వాషింగ్ మెషీన్ లోపల ఉంచడం, టాయిలెట్ జెట్ స్ప్రేని వారి నోట్లో స్ప్రే చేయడం, వారిని నిశ్శబ్దంగా ఉంచడానికి టాయిలెట్ల లోపల లాక్ చేయడం, చిన్నారులు ఏడ్చినప్పుడల్లా బెదిరించడం వంటివి ఆ వీడియోలలో కనిపించాయి. దాంతో ఈ వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరంగా ఈ విషయాన్ని బయటపెట్టిన సుజాత అనే సిబ్బందిని మొదట అక్కడ జాబ్ నుంచి తొలగించారు. ఆ తరువాత చిన్నారులకు సంబంధించి సెన్సిటివ్ ఫొటోలు, వీడియోలు వైరల్ చేసిందన్న ఆరోపణలతో ఆమెను సైతం అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

🚨 माता-पिता काम पर जाते समय बच्चों को भरोसे के साथ सौंपते हैं… ये विश्वासघात है !!

HAL कैंपस की क्रेच में 2-3 साल के मासूम बच्‍चों के साथ अमानवीय अत्याचार!

जिनके हाथों में सुरक्षा के लिए परिजनों ने सौाप उन्‍होंने ही बच्‍चों पर अत्‍याचार किया

# वॉशिंग मशीन के अंदर बंद किया… https://t.co/nflk9jUWgH pic.twitter.com/BwQGoOhltr

— Sunil Yadav (@sunilyadav21) July 1, 2026

భారతీయ న్యాయ సంహిత, జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం ఐదుగురు కేర్‌గివర్లపై హెచ్‌ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులను మంజుల, విజయలక్ష్మి, భవాని, సింధు, బిందులుగా గుర్తించారు. ఐదుగురు నిందితులలో విజయలక్ష్మితో పాటు విషయాన్ని బయటపెట్టిన సుజాత అనే మహిళను హెచ్‌ఏఎల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

డే కేర్ సెంటర్లో వరుస తనిఖీలు..

డే కేర్ సెంటర్‌లో జరుగుతున్న దారుణాలపై బాలల హక్కులు, మనస్తత్వశాస్త్రం, వైద్యం, లా, విద్యారంగ నిపుణులతో కూడిన ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 2న క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌ను తనిఖీ చేసింది. అదే విధంగా జూలై 3, 4 తేదీల్లో కెఎస్‌సిపిసిఆర్ (KSCPCR), జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి.

ఎన్‌సిపిసిఆర్ (NCPCR) బృందం రెండు రోజులూ అక్కడికి వెళ్లి పరిశీలించి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని సంతోష్ కుమార్ చెప్పారు. బాత్రూమ్‌లో చిన్నారుల్ని డోర్ లాక్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇలా జరగకుండా ఉండాల్సిందని అన్నారు. కమిషన్ ఇప్పటివరకు కేవలం ఒకే చిన్నారి తల్లిదండ్రులను మాత్రమే కలిసి మాట్లాడగలిగిందని ఆయన తెలిపారు.

అవసరమైన చోట అదనపు చట్టపరమైన నిబంధనలను చేర్చాలని, ఇందులో ప్రమేయం ఉన్నవారందరి పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని కమిషన్ పోలీసులను ఆదేశించింది. కెఎస్‌సిపిసిఆర్ విధానపరమైన సమస్యలపై ప్రభుత్వం నుండి వివరాలను కూడా కోరింది. డేకేర్ సెంటర్లను నియంత్రించే ప్రస్తుత నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చూస్తామని తెలిపింది. తల్లిదండ్రులకు డేకేర్ సెంటర్ సీసీటీవీ (CCTV) ఫుటేజీని చూసే సదుపాయాన్ని కల్పించడం, కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) రూపొందించడం, డేకేర్ సిబ్బంది అందరికీ ఉద్యోగంలో చేరడానికి ముందే తగిన శిక్షణ ఇచ్చేలా చూడటం వంటి చర్యలను సిఫార్సు చేస్తూ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాయనుంది.

బెంగళూరు డేకేర్ వేధింపుల కేసులో వాస్తవాలు బయటపెట్టిన సుజాత కుమారుడైన గౌతమ్ మాట్లాడుతూ.. పసిపిల్లలపై జరుగుతున్న వేధింపుల గురించి అమ్మ నాకు చెప్పినప్పుడు, ఆధారాలను రికార్డ్ చేయమని ఆమెకు సలహా ఇచ్చినట్లు తెలిపాడు. పిల్లలపై జరుగుతున్న వేధింపులను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆమె రహస్యంగా వీడియోలను రికార్డ్ చేసిందని తెలిపాడు.

నాలుగు నెలలుగా పనిచేస్తున్న సిబ్బందికి, తన తల్లికి డేకేర్ సూపర్‌వైజర్ మంజుల సమస్యలు సృష్టిస్తోందని గౌతమ్ ఆరోపించాడు. వీడియోలు రికార్డ్ చేసిన మరుసటి రోజు జూన్ 24న మంజుల తన తల్లిని ఉద్యోగం నుండి తొలగించేలా చేసిందన్నాడు. ఆ వీడియోలను డిలీట్ చేయాలని మంజుల సుజాతను కోరిందని, తనను కొందరు వ్యక్తులు వెంబడిస్తున్నారని, తల్లి సుజాత ఆ ఫుటేజీని వెంటనే ఎవరికి షేర్ చేయలేదని తెలిపాడు.