Beerakaya Thokka Pachadi Recipe : బీరకాయ వండుకున్నప్పుడు చాలామంది తొక్కను తీసి పడేస్తుంటారు. కానీ ఆ తొక్కతోనే రుచికరమైన పచ్చడి చేసుకోవచ్చని ఎక్కువమందికి తెలియదు. మీరు ఇంట్లో పండించుకున్న బీరకాయలు, లేదా తోటలో ఆర్గానిక్గా పండించిన బీరకాయలు దొరికితే చక్కగా కూరతో పాటు.. బీరకాయ తొక్కతో టేస్టీ పచ్చడి చేసుకోవచ్చు. కొంచెం పులుపు, కారం, వెల్లుల్లి రుచితో చేసుకునే ఈ పచ్చడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి బీరకాయ తొక్క పచ్చడిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

బీరకాయ తొక్కలు - 2 కప్పులు

ఎండు మిరపకాయలు - 7

పచ్చిమిరపకాయలు - 2

చింతపండు - నిమ్మకాయంత

వెల్లుల్లి రెబ్బలు - 4

ధనియాలు - 1 టీస్పూన్

జీలకర్ర - అర టీస్పూన్

మినప్పప్పు - 1 టీస్పూన్

శనగపప్పు - 1 టీస్పూన్

ఉప్పు - తగినంత

నూనె - 2 టీస్పూన్లు

Also Read : నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ

తాలింపు కోసం

నూనె - 1 టీస్పూన్

ఆవాలు - అర టీస్పూన్

మినప్పప్పు - అర టీస్పూన్

ఎండు మిరపకాయ - 1

కరివేపాకు - కొద్దిగా

ఇంగువ - చిటికెడు

తయారీ విధానం

ముందుగా బీరకాయలను బాగా కడిగి పై తొక్కను పలుచగా తీసుకోవాలి. తొక్కలపై మట్టి లేదా ఇతర మలినాలు లేకుండా మరోసారి నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. తర్వాత ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

Also Read : వంకాయ, బంగాళదుంప కూర.. అన్నం, చపాతీల్లోకి తినేందుకు బెస్ట్ రెసిపీ ఇదే

అదే పాన్‌లో మరో టీస్పూన్ నూనె వేసి బీరకాయ తొక్కలను వేయాలి. తొక్కలు మెత్తగా మారి, కొద్దిగా రంగు మారే వరకు మీడియం మంటపై వేయించాలి. మాడ్చకూడదు. మాడ్చితే అది చేదుగా ఉంటుంది. తొక్కల్లో నీరు పూర్తిగా ఆవిరైపోయేలా చూసుకోవాలి. చివర్లో చింతపండు వేసి ఒక నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

వేయించిన పదార్థాలన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అందులో వెల్లుల్లి, ఉప్పు వేసి ముందుగా కొద్దిగా మిక్సీ పట్టాలి. తర్వాత బీరకాయ తొక్కలను వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే ఒకటి రెండు చెంచాల నీరు వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టాలి.

చిన్న పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఎండు మిరపకాయ, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ తాలింపును పచ్చడిపై వేసి బాగా కలపాలి. అంతే నోరూరించే రుచికరమైన ఆంధ్రా స్టైల్ బీరకాయ తొక్క పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. పప్పు, పెరుగు అన్నంతో కూడా ఈ పచ్చడి బాగుంటుంది.

Also Read : బయట క్రిస్పీగా.. లోపల జ్యూసీగా ఉండే హైదరాబాద్ చికెన్ 65.. రెసిపీ ఇదే