ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుభ్‌మన్ గిల్‌ను 'మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో సత్కరించనుంది. BCCI శనివారం 'నమన్ అవార్డ్స్ 2026' జాబితాను విడుదల చేసింది. ఇందులో శుభ్‌మన్ గిల్‌కు మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, స్టార్ ఉమెన్ బ్యాటర్ స్మృతి మంధానకు బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం, మార్చి 15న జరగనుంది.

పాలీ ఉమ్రిగర్ అవార్డు..

BCCI నమన్ అవార్డులు 2006-07లో ప్రారంభించారు. గత ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లను ఈ అవార్డులతో గౌరవిస్తారు. మెన్స్ కేటగిరీలో ఇచ్చే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 'పాలీ ఉమ్రిగర్ అవార్డు' అని పిలుస్తారు.

శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు. గిల్ పాలీ ఉమ్రిగర్ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. 2025 సంవత్సరంలో 9 టెస్టు మ్యాచ్‌ల్లో 983 పరుగులు చేశాడు. గత ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇదే సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 754 పరుగులతో రాణించాడు. ఇవి కాకుండా 11 వన్డేల్లో 490 పరుగులు చేశాడు.

మరోవైపు, స్మృతి మంధాన వరుసగా రెండో ఏడాది బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును అందుకోబోతోంది. మంధాన ఈ గౌరవాన్ని అందుకోవడం ఇది ఐదోసారి కావడం విశేషం.

టీ20 వరల్డ్ కప్ ఆడని గిల్
టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు వైస్ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌ను టీ20 జట్టు నుండి తప్పించారు. పేలవమైన ఫామ్ కారణంగా అతడిపై వేటు పడింది. 2025 ప్రారంభం నుండి టీ20ల్లో వరుసగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో గిల్ విఫలమయ్యాడు. దీని ఫలితంగా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. స్టార్ బ్యాటర్ అయినప్పటికీ, జట్టు ప్రయోజనాలే ముఖ్యం కావడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ, హెడ్ కోచ్ గిల్‌కు అవకాశం ఇవ్వలేదు. కాగా, టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ జట్టును ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడం తెలిసిందే.

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా రికార్డులు..

టీ20 వరల్డ్ కప్ వరుసగా రెండోసారి అందుకున్న జట్టుగా టీమిండియా నిలిచింది. పొట్టి ప్రపంచ కప్‌ను రికార్డు స్థాయిలో మూడోసారి అందుకున్న ఏకైక జట్టుగా భారత్ చరిత్ర లిఖించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ మొదట్లో తడబడిన చివరికి ఆశించిన స్థాయిలో రాణించి టీ20 వరల్డ్ కప్‌ను నిలుపుకుంది. స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ నెగ్గిన జట్టుగా భారత జట్టు నిలిచింది.