Bandi Bhagirath Bail: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న ఆయనకు రెగ్యులర్‌ బెయిల్ మంజూరు అయ్యింది. ఇరు పక్షాల వాదన విన్న హైకోర్టు భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు పలు షరతులు విధించింది. దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేసే చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. లక్ష పూచికత్తు సమర్పించాలని పేర్కొంది.

బండి భగీరథ్‌ తనపై అత్యాచారం చేశాడని 16ఏళ్ల బాలిక హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు మాయమాటలు చెప్పి తన పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు తల్లితో కలిసి ఆమె ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె వయసు నిర్దారించుకున్న తర్వాత పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఇంతలో బండి భగీరథ్‌ కనిపించకుండా పోయారు. నాలుగు రోజుల హైడ్రామా తర్వాత పోలీసులు ఆయన్ని కూడా అరెస్టు చేశారు. వెంటనే కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి 45రోజుల పాటు రిమాండ్ ఖైదీగా భగీరథ్‌ ఉన్నారు. ఈ మధ్య పరీక్షలు ఉన్నాయని చెప్పి మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. వారం రోజుల పాటు ఇంట్లో ఉండి పరీక్షలు రాసిన తర్వాత కోర్టులో లొంగిపోయారు.

ఈ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. దీనిపై నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. భగీరథ్ విద్యార్థి అని జైల్లో ఉండటం వల్ల చాలా ఆయన కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందని వాదించారు. పరస్పర అంగీకారంతో జరిగిన విషయాలను కక్షపూరితంగా బహిర్గతం చేసి కేసులు పెట్టారని అన్నారు.

దీనిపై పీపీ లాయర్లు తప్పుపట్టారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆయన ఫ్యామిలీకి ఉన్న పలుకుబడిన ఉపయోగించి కేసును తప్పుదారి పట్టిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ కీలక దశకు చేరుకుందని అభియోగపత్రాలు దాఖలు చేస్తామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే కచ్చితంగా దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు.

అన్ని వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె. సుజన తీర్పును రిజ్వర్ చేశారు. ఈ మధ్యాహ్నం తీర్పు వెల్లడించారు. బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం షరతులు విధించారు.