Compensation to Model for bad Hair Cut | న్యూఢిల్లీ: హెయిర్ కట్ సరిగ్గా చేయని కేసులో మోడల్‌కు రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ ప్రత్యేకమైన కేసులో మొదట నేషనల్ కన్స్యూమర్ కమిషన్ (NCDRC) రూ. 2 కోట్లు పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఈ మొత్తం చాలా ఎక్కువ అని భావించి, పరిహారాన్ని ఇరవై ఐదు లక్షలకు తగ్గిస్తూ తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

అసలేం జరిగిందంటే..

2018లో ఆష్నా రాయ్ అనే మోడల్, ఒక ప్రొఫెషనల్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు హెయిర్ కట్ చేయించుకునేందుకు వెళ్లింది. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్ ITC మౌర్య సెలూన్‌లో ఆమె రెగ్యులర్ హెయిర్ స్టైలిస్ట్ ఆ సమయానికి అందుబాటులో లేరు. వేరే సిబ్బంది ఆమెకు హెయిర్ కట్ చేశారు. అయితే సెలూన్ సిబ్బంది మోడల్ సూచనలను పాటించలేదు. మరోవైపు జట్టు చాలా దారుణంగా కట్ చేశారు. హెయిర్ ట్రీట్‌మెంట్ సమయంలో అధిక అమ్మోనియా కారణంగా, ఆమె జుట్టు, తలపై చర్మం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో మోడల్ తీవ్ర మానసిక వేదన అనుభవించారు.

మోడల్ నేషనల్ కన్స్యూమర్ కమిషన్‌లో మోడల్ ఆష్నా రాయ్ ఫిర్యాదు చేసింది. రాంగ్ హెయిర్ ట్రీట్‌మెంట్, హెయిర్ కట్ కారణంగా ఆమె మానసిక వేదనకు గురైందని, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు సైతం కోల్పోయినట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. మోడల్ ఫిర్యాదుపై నేషనల్ కన్స్యూమర్ కమిషన్ సెప్టెంబర్ 2021లో హోటల్‌కు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. హోటల్ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి పరిశీలించాలని NCDRCకి పంపింది.

కేసు తిరిగి NCDRCకి వెళ్లిన తర్వాత, మోడల్ ఏకంగా 5.2 కోట్లు డిమాండ్ చేసింది. ఏప్రిల్ 2023లో, NCDRC మళ్ళీ రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని హోటల్‌ను ఆదేశించింది. NCDRC, ITC లిమిటెడ్‌ను ఘటన జరిగిన తేదీ నుండి పరిహారం చెల్లించే తేదీ వరకు 9 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.

ITC హోటల్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిబ్రవరి 6న జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మనమోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై తీర్పు ఇచ్చింది. ఆమె కోరిన పరిహారం చాలా ఎక్కువ అని, NCDRCలో మోడల్ తన వాదనకు తగిన ఆధారాలు సమర్పించలేదని జడ్జీలు కూడా అన్నారు. ఆమెకు ఏదైనా నష్టం జరిగినా, రూ. 2 కోట్ల పరిహారం చెల్లించేంతగా కాదన్నారు.

ఒకవైపు వాదనలు విని నిర్ణయాలు తీసుకోకూడదు

NCDRC పరిహారం నిర్ణయించేటప్పుడు వాస్తవాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎప్పుడైనా పరిహారం ప్రకటించే సమయంలో, కేవలం వైపు వాదన మాత్రమే విని నిర్ణయం తీసుకోరాదని సూచించింది. 2023లో కేసును తిరిగి NCDRCకి పంపేటప్పుడు మోడల్‌కు రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించారని కోర్టు తెలిపింది. ఈ పరిహారం సరిపోతుందని, ఆ మొత్తాన్ని మోడల్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.