సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ సమయంలో క్రికెట్ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఐసీసీ చర్యలు చేపట్టింది. భారత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆసియా కప్ టోర్నమెంట్ సమయంలో 4 డీమెరిట్ పాయింట్లు రావడంతో హారిస్ రౌఫ్‌ను 2 వన్డే మ్యాచ్‌ల నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.

పాక్ పేసర్ రౌఫ్ కు భారత్ తో జరిగిన 2 వేర్వేరు ఘటనలకుగాను 30-30 శాతం జరిమానా విధించారు. దీనితో పాటు దక్షిణాఫ్రికాతో మంగళవారం ప్రారంభమైన వన్డే సిరీస్ లో 2 మ్యాచ్ ల నుండి హారిస్ రౌఫ్‌ను నిషేధించారు. నవంబర్ 6న జరిగే రెండో మ్యాచ్ లో కూడా అతను ఆడేందుకు అవకాశం లేదు. హారిస్ రౌఫ్ కు ఈ 2 ఘటనలకు గాను నాలుగు డీమెరిట్ పాయింట్లు వచ్చాయి. వీటిని ఐసీసీ నిబంధనల ప్రకారం 2 సస్పెన్షన్ పాయింట్లుగా మార్చింది.

సూర్యకుమార్ యాదవ్ పై చర్యలు

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ పై మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించింది ఐసీసీ. సూర్య సైతం క్రీడల ప్రతిష్టకు భంగం కలిగించినట్లు భావించింది. భారత కెప్టెన్ పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలుపుతూ భారత సాయుధ దళాలకు మద్దతు ఇచ్చాడు.

జస్ప్రీత్ బుమ్రాపై కూడా ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఎందుకంటే పాక్‌తో జరిగిన ఫైనల్లో రౌఫ్ ను ఔట్ చేసిన తర్వాత అతను 'విమానం కూలిపోయింది' అని సైగ చేశాడు. సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై 30 శాతం జరిమానా విధించింది. ఈ వార్తను మొదట సెప్టెంబర్ 26న పిటిఐ రిపోర్ట్ చేసింది.

సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ లో విమానం కూలిపోవడాన్ని సూచించే అభ్యంతరకరమైన సంజ్ఞలు చేసినందుకు హారిస్ రౌఫ్ తప్పు చేసినట్లు ఐసీసీ తేల్చింది. రౌఫ్ ఆపరేషన్ సింధూర్ లో భారత సైనిక చర్యను ఎగతాళి చేశాడు. ఈ ఘర్షణలో 6 భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదనకు మద్దతు తెలిపాడు. సెప్టెంబర్ 28న బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు భారత అభిమానులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ, రౌఫ్ అదే సంజ్ఞను మరోసారి చేశాడు.

గన్ సెలబ్రేషన్స్.. ఐసీసీ ఆగ్రహం

పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ కు కూడా ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. భారత ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను ఎలాంటి జరిమానా లేదా డీమెరిట్ పాయింట్ విధించలేదు. ఫర్హాన్ భారత్ పై హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్ తో తుపాకీని కాల్చినట్లు సంజ్ఞ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు.

సెప్టెంబర్ 14, 2025న 'సూర్యకుమార్ యాదవ్ (భారత్) ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని నిబంధన 2.21 ను ఉల్లంఘించాడు. ఇది క్రీడల ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తనకు సంబంధించినది. సూర్య మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తున్నాం. 2 డీమెరిట్ పాయింట్లు ఇస్తున్నామని' ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

దీని ప్రకారం 'సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్) కూడా ఇదే తప్పిదానికి పాల్పడినట్లు తేలింది. అతనికి ఒక డీమెరిట్ పాయింట్ విధించాం' అని పేర్కొంది. 'హారిస్ రౌఫ్ (పాకిస్తాన్) కూడా ఇదే తప్పిదానికి పాల్పడినట్లు తేలింది. రౌఫ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించాం. ఫలితంగా అతనికి 2 డీమెరిట్ పాయింట్లు వచ్చాయని' ఐసీసీ పేర్కొంది.

అర్షదీప్ విషయం సోషల్ మీడియా క్లిప్ నకు సంబంధించినది. అతను పాకిస్తాన్ అభిమానులను ఎగతాళి చేస్తూ కనిపించాడు. అయితే ఐసీసీ మ్యాచ్ రిఫరీకి ఇది అభ్యంతరకరంగా అనిపించలేదు. సెప్టెంబర్ 21న భారత్, పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ కు సంబంధించినది.

సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్ లో చేసిన చర్యలకు విధించిన ఆంక్షలపై ఐసీసీ ఇలా స్పందించింది. 'జస్ప్రీత్ బుమ్రా (భారత్) క్రీడల ప్రతిష్టకు భంగం కలిగించే ప్రవర్తనకు సంబంధించిన నిబంధన 2.21 కింద మోపబడిన ఆరోపణను, ప్రతిపాదిత అధికారిక హెచ్చరికను అంగీకరించాడు. ఫలితంగా అతనికి ఒక డీమెరిట్ పాయింట్ విధించాం' అని తెలిపింది.

మునుపటి విచారణ సమయంలో తనను తాను నిర్దోషిగా చెప్పుకున్న రౌఫ్, భారత ప్రేక్షకులకు మళ్లీ అభ్యంతరకరమైన సంజ్ఞలు చేస్తూ కనిపించాడు. 'ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ నిర్వహించిన విచారణ తర్వాత హారిస్ రౌఫ్ (పాకిస్తాన్) మళ్లీ నిబంధన 2.21 ను ఉల్లంఘించాడని తేలింది. అతనికి మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించగంతో పాటు 2 అదనపు డీమెరిట్ పాయింట్లు వచ్చాయని' తెలిపింది.