Asia Cup 2025 Ind vs Ban Latest News : ఆసియాక‌ప్ 2025లో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. బుధ‌వారం బంగ్లాదేశ్ తో డిఫెండింగ్ చాంపియ‌న్ భార‌త్ ఢీకొననుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే దాదాపుగా ఫైన‌ల్ బెర్త్ ద‌క్కుతుంది. ఈ మ్యాచ్ లో ఫేవ‌రెట్ గా భార‌త్ బ‌రిలోకి దిగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ తిరుగు లేని విజ‌యాల‌ను టీమిండియా ద‌క్కించుకుంది. ఈక్ర‌మంలో ఈ మ్యాచ్ లోనూ గెలిచి, వ‌రుస‌గా రెండోసారి ఫైన‌ల్లోకి దూసుకెళ్లాల‌ని భావిస్తోంది. ఇక పాకిస్థాన్ తో జ‌రిగిన తుదిజ‌ట్టునే ఈ మ్యాచ్ లోనూ ఆడించే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు సూప‌ర్-4లో శ్రీ‌లంక‌ను చిత్తు చేసిన బంగ్లా.. ఉత్సాహంతో ఉంది. భార‌త్ పై అదే త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న‌ పున‌రావృతం చేసి, మ‌రింత ముందుకు వెళ్లాల‌ని భావిస్తోంది.

అన్ని రంగాల్లో ప‌టిష్టంగా..
ఈ టోర్నీలో హాట్ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగిన భార‌త్ స్థాయికి త‌గ్గ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తోంది. అటు బ్యాటింగ్ లో తుఫాన్ ఆరంభాలు రావ‌డంతోపాటు ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటుతోంది. బ్యాటింగ్ లో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ రెచ్చిపోతున్నాడు. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి, ప్ర‌త్య‌ర్థుల‌కి నిద్ర లేని రాత్రుల‌ను మిగులుస్తున్నాడు. గ‌త మ్యాచ్ లో మ‌రో ఓపెన‌ర్ శుభ‌మాన్ గిల్ ఫామ్ లోకి రావ‌డం శుభ ప‌రిణామం. కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌, సంజూ శాంస‌న్ ల‌తో భార‌త మిడిలార్డ‌ర్ ప‌టిష్టంగా ఉంది. ఆల్ రౌండ‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్, హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబే రెండు విభాగాల్లోనూ త‌మ మార్కును చూపించ‌గ‌ల ప్ర‌తిభావంతులే.. పేస్ బౌలింగ్ ను స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా ఒంటిచేత్తో మోస్తున్నాడు. కుల్దీప్ యాద‌వ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్పిన్ మాయాజాలాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ, దుబాయ్ లోని మంద‌కొడి పిచ్ ఫాయిదాను ఉప‌యోగించుకుంటున్నారు. ఈక్రమంలో అటు భారత బ్యాటింగ్, బౌలింగ్ ను బంగ్లా ఎంతవరకు నిలువరించగలదో చూడాలి.

ఉత్సాహంలో బంగ్లా..
ఇక లీగ్ ద‌శ‌లో సాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న చేసి, ల‌క్కు క‌లిసొచ్చి సూప‌ర్ ఫోర్ కు బంగ్లా చేరింది. అయితే ఈ ద‌శ‌లో లంక‌కు షాకిచ్చి, ఇత‌ర జ‌ట్ల‌కు ప్ర‌మాద ఘంటిక‌ల‌ను పంపింది. యువ అనుభ‌వం ఉన్న ఆట‌గాళ్ల‌తో ఆ జ‌ట్టు స‌మ‌తూకంగా ఉంది. ముఖ్యంగా కెప్టెన్ లిటన్ దాస్ పై ఎక్కువగా ఆధారపడుతోంది. తౌహిద్ , తంజిద్ హసన్ లాంటి యువకులు సత్తా చాటుతున్నారు. ఇక ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్ లాంటి పేసర్లు జట్టుకు వెన్నెముకగా నిలిచారు. త‌న‌దైన రోజున ఎంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌ట్టును కూడా ఓడించ గ‌ల నైపుణ్యం బంగ్లా సొంతం. ఇక ఈ ఫార్మాట్ లో ఒక మ్యాచ్ లో ఇండియాను ఓడించిన అనుభ‌వం కూడా బంగ్లాకు ఉంది. దీంతో ఈ మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోకుండా ప్ర‌ణాళిక బ‌ద్దంగా భార‌త్ బ‌రిలోకి దిగాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు మూడుసార్లు ఫైన‌ల్ కు చేరినా, ర‌న్న‌ర‌ప్ తోనే స‌రిపెట్టుకున్న బంగ్లా.. ఈసారైనా క‌ప్పును ముద్దాడాల‌ని భావిస్తోంది.