Aqua industry to get relief from India-US trade deal: అమెరికా , భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు కూడా తగ్గుతాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని ఆక్వా రంగానికి, ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గతంలో పెరిగిన సుంకాల కారణంగా అమెరికాకు జరిగే ఎగుమతులు సుమారు 15 శాతం తగ్గిపోయాయని, తాజా తగ్గింపుతో నిలిచిపోయిన ఆర్డర్లు తిరిగి ప్రారంభమై ఎగుమతులు పుంజుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా అమెరికాకు ఎగుమతి అయ్యే ఫ్రోజెన్ ష్రింప్ ఎగుమతులు రాబోయే నెలల్లో 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మంత్రి వివరించారు. టారిఫ్ భారం తగ్గడం వల్ల సముద్ర ఆహార ప్రాసెసింగ్ రంగంలో లాభాల మార్జిన్ 5 శాతం నుంచి తిరిగి 8 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. దీనికి తోడు కేంద్ర బడ్జెట్-2026లో ఆక్వా రంగానికి అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన డ్యూటీ రాయితీలు ఈ రంగానికి అదనపు బలాన్ని ఇస్తాయని ఆయన వెల్లడించారు.

కేవలం అమెరికాపైనే కాకుండా.. యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం, రష్యా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు కూడా భారతీయ ఎగుమతులు స్థిరంగా కొనసాగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26 తొలి నాళ్లలో ష్రింప్ ఎగుమతుల్లో అమెరికేతర మార్కెట్ల వాటా 57 శాతానికి చేరడం గమనార్హమన్నారు. మార్కెట్ విభిన్నీకరణ ద్వారా భారతీయ ఆక్వా ఉత్పత్తుల పోటీ తత్వం అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపడుతోందని ఆయన విశ్లేషించారు.

ఎగుమతులు 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం
- యూరోప్, చైనా, వియత్నాం, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి అమెరికేతర మార్కెట్లకు స్థిరంగా కొనసాగుతున్న ఎగుమతులు
- రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి అచ్చెన్న‌ pic.twitter.com/cKr2HgB0gm

— I & PR Andhra Pradesh (@IPR_AP) February 3, 2026

దేశంలోనే సముద్ర ఆహార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిణామాలు వరంగా మారుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఎగుమతులు పునరుద్ధరించబడటం వల్ల రాష్ట్రంలోని వేలాది మంది ఆక్వా రైతులు, మత్స్యకారుల ఆదాయం స్థిరపడుతుందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా సముద్ర ఆహార ఎగుమతులు 15 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును చేరుకోవచ్చని ఎంపీఈడీఏ (MPEDA) అంచనా వేస్తోందని ఆయన వివరించారు.