WhatsApp governance will start from Thursday in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసేవల్లో ఓ కొత్త మార్పును తీసుకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్‌లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది.

దేశంలోనే మొదటి సారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ధృవపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అదే విధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు.

వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్బోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను డిజిటల్‌ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలన, ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. గురువారం వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్మార్ట్ గవర్నెన్స్ లో భాగంగా ప్రజలకు తక్షణ సేవల అందించాలంటే ఏం చేయాలన్నదానిపై పరిశీలన చేశారు. అనేక సంస్థలు వాట్సాప్ చాట్ బోట్ల ద్వారా అందిస్తున్న సేవల ను మరింత విస్తరించి ప్రభుుత్వాన్ని ప్రజల వద్దకు చేర్చవచ్చన్న ఆలోచన చేశారు. ఆ మేరక లోకేష్ టీం ఈ అంశంపై పూర్తి స్థాయి పరిశీలన జరిపి మెటాను సంప్రదించింది.

ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా వంటి వరల్డ్ లీడింగ్ సోషల్ మీడియా సంస్థలను కలిగి ఉన్న మెటా ప్రభుత్వం కోసం ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. వాట్సప్ లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మ‌నిషికి అవ‌స‌ర‌మైన స‌మ‌స్త వ‌స్తువులు వ‌స్తున్నప్పుడు, సేవ‌లు అందుతున్నప్పుడు.. ఒక స‌ర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ ప‌నులు మానుకుని మ‌రీ తిర‌గాల్సిన అవసరం ఉండకూడదనేది లోకేష్ ఆలోచన. మెటాతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా పారదర్శక పౌరసేవలు మరింత సులభం అవుతాయని అంచనా వేస్తున్నారు. మెటా సేవల వల్ల న‌కిలీలు, ట్యాంప‌రింగ్ అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శకంగా ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్ల జారీ చేస్తారు. మెటా నుంచి క‌న్సల్టేష‌న్ టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నెన్స్ అమ‌లు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ద్వారా మ‌రిన్ని సిటిజెన్ స‌ర్వీసెస్ అందనున్నాయి.

Also Read: రైలు పట్టాలపై పడుకోబెడతా - జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే