AP PMAY Gramin 2.0: ఆంధ్రప్రదేశ్ లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరే వార్త తెలిసింది. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ 2.0 (AP PMAY Gramin 2.0) కింద రాష్ట్రంలో కొత్త ఇళ్ల మంజూరుకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు విడతల వారీగా ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రక్రియ ప్రారంభించాయి. మే, జూన్ నెలల్లో మొదటి విడతగా లక్ష ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ఏపీలో లక్ష ఇళ్లకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో సొంతింటి కోసం అర్హులైన వారు లక్షలాది మంది పీఎంఏవై కింద దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులను వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ వారీగా పరిశీలించి, అర్హుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మంది ఇంటి కోసం అప్లై చేసుకోగా, పరిశీలించిన అధికారులు దాదాపు 7 లక్షల మందిని అర్హులుగా గుర్తించబడినట్లు తెలుస్తోంది. వీరిలో మొదటి విడతగా లక్ష మందికి AP PMAY Gramin 2.0 కింద సొంతింటిని మంజూరు చేయనున్నారు.

జూన్ నుంచి ఇంటి నిర్మాణం

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి చర్యలు చేపట్టనుంది. మే చివరికల్లా కేంద్రం ఆమోదం లభిస్తే, జూన్ నెల నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దీంతో గ్రామాల్లో పేదలకు సొంతింటి కల నెరవేరనుంది.

ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు

ఏపీ పీఎంఏవై గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.39 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అందిస్తాయి.
ముఖ్యంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఈ సాయం అందిస్తాయి. నివేదికల ప్రకారం, కేంద్రం రూ.72 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.28 లక్షలు, టాయిలెట్ల నిర్మాణానికి అదనపు సాయంతో మొత్తం రూ.2.39 లక్షలు అందించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. దరఖాస్తుదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్, భూమి వివరాలు, ఇతర పత్రాల వివరాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. లబ్ధిదారుల లిస్ట్ లను గ్రామ సచివాలయంలో ఉంచుతారు.