<p>జీడీ నెల్లూరు: ఏపీలో పెన్షన్ల పంపిణీ మొదలైంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. జీడీ నెల్లూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆయన స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ లబ్ధిదారు మహిళ ఇంట్లో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. ఒక్కొక్కరి పేరిట రూ.2 లక్షలు ఎఫ్‌డీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో ప్రజావేదిక ద్వారా సమావేశమై సీఎం <a title="చంద్రబాబు" href="https://telugu.abplive.com/topic/Chandrababu" data-type="interlinkingkeywords">చంద్రబాబు</a> ప్రసంగించారు.</p>
<p>అయిదేళ్ల తరువాత ఏపీలో భయం పోయి, ఎటు చూసినా నవ్వులు కనిపిస్తున్నాయి. ప్రజలు ఎంతో స్వేచ్ఛగా కనిపిస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆశీర్వదిస్తారు. గత ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. రూ.200 ఉన్న పింఛన్ ను రూ.2000 చేయగా.. ప్రజల్ని ఏడిపించి ఏడిపించి రూ.3000 ఫించన్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ప్రజల మీద ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో మేం రూ.4000కు పింఛన్ పెంచాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు కూడా అందించాం. దివ్యాంగులకు రూ.500 నుంచి పింఛన్లు ఇప్పుడు రూ.6000 కు పెంచి వారికి ఆర్థిక భరోసా కల్పించాం. 8 లక్షల మందికి నెలకు రూ.6 వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం. </p>