Bay of Bengal Cyclone Alert AP: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ అల్పపీడన పరిణామాలు రానున్న రోజుల్లో బలపడి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 27 నుంచి 30వ తేదీల మధ్య ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చి కోస్తాంధ్ర , ఒడిశా తీరాల వైపు దూసుకొచ్చే సూచనలు స్పష్టమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా దక్షిణ తీరప్రాంతాలు ఈ తుఫాను తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉండటంతో తీరప్రాంత యంత్రాంగాన్ని ముందస్తుగా అప్రమత్తం చేశారు.

ఈ ముప్పు దృష్ట్యా అక్టోబర్ 27 నుంచి 30 మధ్య కోస్తాంధ్ర ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో, పీక్ సమయంలో అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే వీలుంది. తీరప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ సమాయత్తమవుతున్నాయి. వేటకు వెళ్లిన మత్స్యకారులను వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ తుఫాను ప్రభావం పొరుగున ఉన్న తెలంగాణపై ఎంతవరకు ఉంటుంది? అనే దానిపై వాతావరణ శాఖ స్పష్టతనిచ్చింది. తెలంగాణకు నేరుగా తుఫాను ముప్పు లేనప్పటికీ, తీరప్రాంతానికి సమీపంలో ఉండే ఉమ్మడి ఖమ్మం , నల్గొండ, సూర్యాపేట , మహబూబాబాద్ జిల్లాల్లో దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అక్టోబర్ 27 రాత్రి నుంచి 30వ తేదీల మధ్య తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో మోస్తరు నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.

SEVERE CYCLONE ALERT - UPDATE 2 🌀🌪️ A LPA/Depression is expected to form in Central BoB on October 24, subsequently intensify into a Cyclone on October 26 It is expected to become a MAJOR CYCLONE with Category 3 storm and winds around 160-200kmph and cross between Central AP and South Odisha on October 28 as a DANGEROUS CYCLONE ⚠️⚠️🌀 After almost 3 years, Bay of Bengal is hosting a SEVERE CYCLONE and move towards East India coast East Telangana to come under its impact with MODERATE RAINS likely during October 29-31 (Bhadradri - Kothagudem will get HEAVY RAINS) Other parts of Telangana will have LIGHT RAINS during this period Any changes in the forecast will be communicated accordingly ⚠️🌀

— Telangana Weatherman (@balaji25_t) October 22, 2026

అయితే హైదరాబాద్ సహా పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తుఫాను ప్రభావం సాపేక్షంగా తక్కువగానే ఉండనుంది. అక్కడ వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే వీలుంది. కానీ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో హఠాత్తుగా వీచే ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాల వల్ల చేతికొచ్చిన ఖరీఫ్ పంటలకు కొంతమేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఆయా జిల్లాల రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

అక్టోబర్ చివరి వారంలో రానున్న ఈ తుఫాను తీవ్రత ప్రధానంగా కోస్తాంధ్ర-ఒడిశా తీరాలపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యంత్రాంగాన్ని హై అలర్ట్‌లో ఉంచగా, తెలంగాణ సైతం సరిహద్దు జిల్లాల్లో వాతావరణ మార్పులను నిశితంగా పరిశీలిస్తోంది. రాబోయే 48 గంటల్లో ఈ తుఫాను కచ్చితమైన గమనం , దాటే తీరంపై IMD పూర్తి స్థాయి బులెటిన్లను విడుదల చేయనుంది.