73 Lakh New Passbooks Distribution:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా భూముల రికార్డులు, పట్టాదారు పాస్‌బుక్కుల చుట్టూ నడిచిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తరచూ చెబుతుండేవారు. అయితే ఆయన దానికి ఎంచుకున్న మార్గం మాత్రం తీవ్ర వివాదాస్పదమైంది. రైతుల జీవితకాలపు ఆస్తి అయిన పట్టాదారు పాస్‌బుక్కులపై, సరిహద్దు రాళ్లపై తన ఫోటోలను ముద్రించడమే కాకుండా, వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను తీసుకురావడం తీవ్ర దుమారం రేపింది. ఈ చర్య సామాన్య రైతుల్లో తీవ్ర అభద్రతాభావానికి దారితీయగా.. కూటమి ప్రభుత్వం ఈ తప్పును సరిదిద్దుతూ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో మైలేజ్ పెంచుతోంది.

రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు

గత ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రధాన ఎజెండాలలో భూ హక్కుల పరిరక్షణ ఒకటై నిలిచింది. జగన్ ఫోటోలతో కూడిన పాస్‌బుక్కులను ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని గ్రహించిన చంద్రబాబు నాయుడు.. తాము అధికారంలోకి రాగానే ఆ ఫోటోలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే, కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక రికార్డు స్థాయిలో 73 లక్షల కొత్త పట్టాదారు పాస్‌బుక్కులను ముద్రించేందుకు శ్రీకారం చుట్టింది. జగన్ మోహన్ రెడ్డి ఫోటోలను పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో అధికారిక ప్రభుత్వ చిహ్నమైన రాజముద్ర ముద్రించి తమదైన పారదర్శక మార్పును చూపించింది.

రైతులకు పాస్ పుస్తకాలతో కొత్త ధైర్యం

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాస్‌బుక్కుల విశేషాలు, వాటి డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. కేవలం ఫోటో మార్చడమే కాకుండా, మునుపటి కంటే అత్యంత నాణ్యమైన పేపర్, సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన క్యూఆర్ కోడ్ సాంకేతికతను ఇందులో పొందుపరిచారు. తద్వారా రైతులు తమ భూమి వివరాలను ఫోన్‌లోనే సులభంగా వెరిఫై చేసుకునే వీలు కల్పించారు. గత ప్రభుత్వంలో తమ సొంత భూమిపై తమకు హక్కు ఉందో లేదో అనే భయంలో బతికిన రైతులకు, ఈ అధికారిక రాజముద్ర తో కూడిన పత్రాలు అందడంతో వారిలో కొండంత నమ్మకం, కొండంత ధైర్యం ఏర్పడ్డాయి.

రైతుల్లో సానుకూలత

ఈ నిర్ణయం వల్ల క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వంపై రైతాంగంలో విపరీతమైన సానుకూలత వ్యక్తమవుతోంది. నిజానికి, గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాల్లో భూముల వ్యవహారం ఒకటి. చివరకు వైసీపీకి ఓటు వేసిన సామాన్య ఓటర్లు కూడా ఆస్తి మాది.. దానిపై జగన్ ఫోటో ఎందుకు అనే అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసి, రైతులకు తమ సొంత భూమిపై పూర్తి భరోసా కల్పిస్తూ కొత్త పత్రాలు పంపిణీ చేస్తుండటంతో.. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఇది కేవలం పత్రాల మార్పిడి కాదు.. ఒక విధంగా రైతుల ఆత్మగౌరవ పునరుద్ధరణగా ప్రచారం పొందుతోంది.

జగన్ ప్రభుత్వ తప్పిదాన్ని అనుకూలంగా మల్చుకున్న కూటమి

కూటమి ప్రభుత్వం జగన్ చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో 100 శాతం విజయం సాధించింది. గత ఐదేళ్ల పాలనలో వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలను వాడుకున్నారనే అపవాదును వైసీపీ మూటగట్టుకోగా.. తాము వ్యవస్థల నైతికతను, ప్రభుత్వ హుందాతనాన్ని కాపాడుతున్నామని చంద్రబాబు నిరూపించుకున్నారు. 73 లక్షల మంది రైతుల చేతుల్లోకి వెళ్లే ఈ కొత్త పాస్‌బుక్కులు.. ప్రతిరోజూ ప్రభుత్వ నిబద్ధతను రైతులకు గుర్తుచేస్తూ, భవిష్యత్ ఎన్నికలకు కూడా బలమైన పునాదిగా మారబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.