AP Local Elections NDA Seat Sharing | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ స్థానాలపై చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. కూటమిలోని ఏ పార్టీ ఎక్కడ, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రాలేదు. స్థానిక సంస్థల పోస్టులకు రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారైనందున, ఆయా ప్రాంతాల్లో ఏ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారో ప్రాతిపదికగా తీసుకుని తదుపరి చర్చలు ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నిర్ణయించారు.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేశ్, హరిప్రసాద్, బీజేపీ చీఫ్ మాధవ్ సోమవారం కీలక భేటీ అయ్యారు. మొదట జనసేన నేతలతో విడిగా సమావేశమైన చంద్రబాబు, అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి చర్చలు జరిపారు.

రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు స్పష్టత

ఈ భేటీలో ప్రధానంగా రిజర్వేషన్ల ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల ఖరారుకు ముందే తమతో చర్చించి ఉంటే బాగుండేదని జనసేన నేతలు అభిప్రాయం వ్యక్తం చేయగా, ఈ ప్రక్రియను చట్టపరంగా, శాస్త్రీయంగా, అత్యంత పారదర్శకంగా నిర్వహించామని.. పార్టీల జోక్యం ఏమీ లేదని సీఎం చంద్రబాబు వారికి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా లెక్కల ఆధారంగా, బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు ఖరారయ్యాయని, ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రిజర్వేషన్లను తమ ఇష్టారాజ్యంగా మార్చడం వల్ల విమర్శలు వచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు.

నేడు మరోసారి కూటమి కీలక సమావేశాలు

స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలపై మిగిలిన చర్చలను పూర్తి చేసేందుకు టీడీపీ నేతలు పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు నేడు (మంగళవారం) జనసేన ఆఫీసుకు వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంతకని నాదెండ్ల మనోహర్‌లతో సమావేశం కానున్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన పార్టీల వారీగా స్థానాలు, అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరుపుతారు. మరోవైపు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబుతో మరోసారి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ వరుస సమావేశాలతో స్థానిక సంస్థల సీట్ల సర్దుబాటుపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో కూటమి పార్టీలతో పాటు వైసీపీలోనూ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.