AP Local Body Elections | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దాంతో పోలీసులు అప్రమత్తమై పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నామినేషన్ సెంటర్ వద్ద చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియో దృశ్యాలను విశ్లేషించిన పోలీసులు దాదాపు 70 మందిని గుర్తించారు. ఈ ఘటనలపై మొత్తం మూడు కేసులు నమోదు చేసి, గొడవల్లో పాల్గొన్న వారి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుంగనూరులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర చర్యలు: ఏపీ ఎస్‌ఈసీ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ శాంతిభద్రతలపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిస్థితులను అదుపులోకి తెచ్చామని ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠ తెలిపారు. విజయవాడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హింసాత్మక ఘటనలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని, అవసరమైతే అదనపు బలగాలను రప్పిస్తామని హెచ్చరించారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థితో పాటు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఎస్‌ఈసీ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం ఉంటే బదిలీ లేదా సస్పెన్షన్ తప్పదని స్పష్టం చేశారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు గృహనిర్బంధం

మరోవైపు పల్నాడు జిల్లా మాచర్లలో ముందస్తు జాగ్రత్త చర్యగా వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. స్థానిక ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికి మాచర్ల పోలీసులు పిన్నెల్లికి ముందస్తు నోటీసులు జారీ చేశారు.

ఎంపీ అవినాష్ రెడ్డికి పోలీసుల నోటీసులు

అలాగే వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి పులివెందుల సీఐ పురుషోత్తం ముందస్తు నోటీసులు అందజేశారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు లేదా సభలు నిర్వహించకూడదని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైసీపీ కీలక నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషాలకు కూడా పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు భంగం కలిగించేలా అల్లర్లు, గొడవలకు పాల్పడవద్దని నేతలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.