AP Assembly sessions to begin from Wednesday: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. సుమారు గంటసేపు సాగనున్న గవర్నర్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం గత కొద్ది నెలలుగా సాధించిన ప్రగతితో పాటు, భవిష్యత్ ప్రణాళికలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ నెల 14న ఏపీ బడ్జెట్

గవర్నర్ ప్రసంగం అనంతరం 11:30 గంటలకు స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణపై చర్చించనున్నారు. బీఏసీ సమావేశానికి జగన్‌కు ఆహ్వానం పంపారు. సుమారు 20 పనిదినాల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ వ్యూహం - ఒకే రోజు హాజరు

అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న ప్రతిపక్షం వైసీపీ, ఈసారి ఒక విభిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. సభ మొత్తానికి హాజరు కాకుండా, కేవలం తొలిరోజైన బుధవారం మాత్రమే సభకు రావాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. అనర్హతా వేటు పడకుండా 60 రోజుల నిబంధన దృష్ట్యా హాజరు నమోదు చేసుకోవడంతో పాటు, తిరుమల లడ్డూ వివాదం, అంబటి రాంబాబు అరెస్టు,, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై గవర్నర్ ప్రసంగం సమయంలోనే నిరసన తెలపాలని వైసీపీ భావిస్తోంది. ఆ ఒక్కరోజు తమ గళాన్ని బలంగా వినిపించి, ఆ తర్వాత సమావేశాలను బహిష్కరించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు తర్వాత హాజరయ్యే ఉద్దేశం లేదు కాబట్టి.. బీఏసీ సమావేశానికి కూడా జగన్ హాజరు కాకపోవచ్చని భావిస్తున్నారు.

అధికార పక్షం కౌంటర్ వ్యూహం

వైసీపీ వైఖరిని ఎండగట్టేందుకు తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి కూడా సిద్ధమైంది. ప్రజా సమస్యల కంటే రాజకీయ విన్యాసాలకే వైసీపీ ప్రాధాన్యత ఇస్తోందని, సభలో చర్చకు రాకుండా పారిపోతోందని విమర్శించేందుకు కూటమి ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అంశాలు, ప్రస్తుత అభివృద్ధి పనుల మధ్య వ్యత్యాసాన్ని సభలో ఎండగట్టాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు అటు బడ్జెట్ పరంగా, ఇటు రాజకీయ పరంగా అత్యంత కీలకం కానున్నాయి.