<p data-path-to-node="6"> </p>
<p data-path-to-node="9">AP speaker Ayyanna Patrudu | అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 7 వరకు 17 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకవేళ చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటే, అవసరమైతే సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. మొత్తం పదిహేడు రోజుల పాటు శాసనసభ కార్యకలాపాలు సాగనున్నాయి.</p>
<p data-path-to-node="10"> ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మహా శివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని, పండుగ మరుసటి రోజైన 16వ తేదీన సభకు సెలవు ప్రకటించారు. ఫబ్రవరి 17, 18 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ జరగనుంది. ఈ 18వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. పరిపాలనలో పారదర్శకత, ప్రజల అవసరాలే ప్రాతిపదికగా ఈ సమావేశాల అజెండాను రూపొందించారు.</p>