Chandrababu Naidu speech in the assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కీలక ప్రసంగం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న విధ్వంసాన్ని గుర్తు చేస్తూనే, కూటమి ప్రభుత్వం చేపట్టిన 20 నెలల అభివృద్ధి, సంక్షేమ ప్రస్థానాన్ని ఆయన వివరించారు. చట్టసభ అనేది ప్రజా దేవాలయమని, గతంలో దీనిని బూతుల అడ్డా గా మార్చారని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. నాడు తనలాగే ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్నారని, వైసీపీ పాలన ఎంత అరాచకంగా సాగిందో ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల తాము నిర్వహించిన మాక్ అసెంబ్లీలో విద్యార్థులు ప్రస్తుత సభ్యుల కంటే ఎంతో హుందాగా, చక్కగా ప్రసంగించారని కొనియాడారు. సభ గౌరవాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. ముఖ్యంగా పెన్షన్ల కోసం ఏడాదికి 34 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మరేదీ లేదని ఆయన గర్వంగా ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద 10,700 కోట్ల రూపాయలు అందించామని, సంక్షేమంలో ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ప్రోగ్రాం చేపడుతున్నామని వెల్లడించారు.

రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనలో ఆర్టీసీ పాత్రను అభినందిస్తూ, స్త్రీశక్తి పథకం ద్వారా సుమారు 443 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని చంద్రబాబు తెలిపారు. ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో మరో వెయ్యి ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20 వేల రూపాయల ఆర్థిక సాయం వంటి పథకాల అమలును ఆయన వివరించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 29 వేల మంది రైతులు తమ 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వంపై నమ్మకంతో ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. వారికి పైసా కూడా ఇవ్వలేకపోయినప్పటికీ, భవిష్యత్తులో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్వీర్యం చేసినా, తమ ప్రభుత్వం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసిందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ట్రైక్ రేట్‌తో ప్రజలు తమను గెలిపించారని, ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఆయన ప్రకటించారు. శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని సీఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు.