Andhra Pradesh Wealth Fund:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అప్పులు ఆంధ్రప్రదేశ్‌ అని పేరు తెచ్చుకున్న రాష్ట్రాన్ని సంపన్న ఆంధ్రప్రదేశ్‌గా మార్చడానికి ఒక భారీ ఆర్థిక ప్రయోగం మొదలైంది. అదే ఆంధ్రప్రదేశ్‌ వెల్త్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు 2026-27 బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు.ఓ నిధి ఏర్పాటుకు అధికారికంగా పచ్చజెండా ఊపారు. ఇది కేవలం ఒక ప్రభుత్వం సంస్థ కాదని, రాబోయే తరాల భవిష్యత్‌ను బంగారు మయం చేసే ఆర్థిక యంత్రమని ప్రభుత్వం చెబుతోంది.

అసలు ఈ వెల్త్ ఫండ్ అంటే ఏంటీ? సింగపూర్‌, నార్వే వంటి దేశాల్లో ఉన్న వ్యవస్థలు మనకు ఎలా ఉపయోగపడతాయి? సామాన్య రైతుకు, మధ్యతరగతి మనిషికి దీని వల్ల వచ్చే లాభం ఏంటీ? అనే పూర్తి వివరాలపై లోతైన విశ్లేషణ ఇక్కడ చూద్దాం.

అసలు ఏంటీ ఈ వెల్త్‌ఫండ్‌?

మనం ఇంట్లో ఉన్న అదనపు డబ్బును లేదా బంగారాన్ని ఎలాగైతే బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామో లేదా భూమిని కొని దాని మీద వచ్చే ఆదాయంతో మరిన్ని ఆస్తులు కొనే ప్రయత్నం చేస్తామో ప్రభుత్వం అలాంటి ప్రయత్నమే చేస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న కొన్ని ఆస్తులను కేవలం ఖాళీగా ఉంచకుండా వాటిని ఆదాయం ఇచ్చే వనరులుగా మార్చుకుంటుంది. వాటిని ఈ వెల్త్‌ఫండ్స్‌లో జమ చేస్తుంది.

ప్రపంచంలో నార్వే, సింగపూర్‌ వంటి దేశాలు ఇలాంటి సోవర్నిటీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేసి నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంత దేశాలుగా ఎదిగాయి. భారత్‌ దేశంలో ఒక రాష్ట్ర స్థాయిలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వంటి ఆదాయం వచ్చే నగరం లేకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆ అప్పులు 12 నుంచి 1 లక్ష కోట్లు వరకు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఏపీ కడుతున్న వడ్డీలే యాభై వేల కోట్లకుపైగా ఉంటోంది.

కేవలం ప్రజల మీద పన్నులు వేయడం ద్వారా లేదా మళ్లీ అప్పులు చేయడం ద్వారా ఈ పరిస్థితి మార్చలేమని ప్రభుత్వం గుర్తించింది. అందుకే సంపద సృష్టి అనే మంత్రాన్ని జపిస్తోంది. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులను తెలివిగా వాడుకొని ఆస్తులను అమ్మకుండానే ఆదాయం సంపాదించడం ఏకైక మార్గమని వెల్త్‌ ఫండ్‌ను తెరపైకి తెచ్చింది.

స్వర్ణాంద్ర 2047 లక్ష్యంగా అడుగులు

ముఖ్యమంత్రి చంద్రబాబు 2047 నాటికి అంటే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు నిండే నాటికి ఏపీని అగ్ర రాష్ట్రాల జాబితాలో చూడాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఫండ్‌ను క్రియేట్ చేస్తున్నారు. దీని వల్ల ప్రతి ఆంధ్రప్రదేశ్‌లో ఉండే వ్యక్తి ఆదాయం జాతీయ సగటు కంటే మూడు రెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. పేదరికాన్ని జీరోకు వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అమరావతి, పోలవరం వంటి మెగా ప్రాజెక్టులకు నిధుల కొరత కూడా ఉండబోదని వివరిస్తున్నారు.

ఈ ఫండ్‌కు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి?

డబ్బులు లేని రాష్ట్రంలో ఈ ఫండ్‌లో డబ్బులు ఎలా పెడుతుందని అనుమానం చాలా మందికి ఉంటుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం ఈ నిధిలో నగదు కంటే ఎక్కువగా ఆస్తులను పెట్టుబడిగా పెట్టనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల భూమి ఉంది. దీని విలువ మార్కెట్‌లో పది నుంచి 15 లక్షల కోట్లు ఉంటుంది. ఈ భూములను డెవలప్ చేసి లీజుకు ఇస్తే ఆదాయం వస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ, జెన్కో వంటి సంస్థల్లో ఉన్న వాటాలను తెలివిగా వాడుకోవాలని చూస్తోంది. సముద్ర తీరంలోని ఇసుక, ఆయిల్, గ్యాస్ నిక్షేపాల నుంచే ఆదాయాన్ని ఫండ్‌కు తరలిస్తారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు, రాష్ట్రంలో ఉన్న వ్యాపారవేత్తలు ఇతర ఉన్నత వర్గాలు దీనికి ఫండ్ ఇచ్చేలా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే దీనికి ప్రారంభ పెట్టుబడిగా ఇరవై వేల కోట్లు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ కేటాయించింది.

నార్వే మోడల్ ఏం చెబుతోంది?

నార్వే దగ్గర ఆయిల్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక ఫండ్‌ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆ ఫండ్ విలువ సుమారు .1.7 ట్రిలియన్‌లు అంటే 140లక్షల కోట్లు. నార్వేలో ప్రతి పౌరుడి పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు సంపద ఉంది. అక్కడ ప్రజలు ఉచిత విద్య, వైద్యం ఈ ఫండ్ ద్వారానే అందుతుంది.

సింగపూర్ మోడల్‌ ప్రత్యేకత ఏంటీ?

1974లో సింగపూర్‌ ప్రభుత్వం తన కంపెనీలను నిర్వహించడానికి టెమాసెక్ అనే సంస్థను పెట్టింది. చంద్రబాబు ఈ మోడల్‌ను చాలా ఇష్టపడతారు. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, డీబీఎస్‌ బ్యాంకు వంటివన్నీ ఈ ఫండ్ లాభాలతోనే నడుస్తున్నాయి. అందుకే సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడి నిపుణులతో చర్చిస్తారు.