SIT questions Jagan brother Anil Reddy PA in AP liquor scam: ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ప్రమేయంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. . అనిల్ రెడ్డి పీఏ దేవరాజును గత మూడు రోజులుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రతి నెలా రూ. 50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఈ సొమ్ము అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప (A-33), ఎంపీ మిథున్ రెడ్డి (A-4), విజయసాయి రెడ్డి (A-5), పి. కృష్ణమోహన్ రెడ్డి (A-32), కె. ధనుంజయ రెడ్డి (A-31) ద్వారా జగన్‌కు చేరినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

లిక్కర్ పాలసీ మార్చి కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు

YSRCP ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, కొత్త లిక్కర్ పాలసీని అమలు చేసింది. ఈ పాలసీ కింద ప్రముఖ బ్రాండ్లను తొలగించి, తక్కువ గుర్తింపు ఉన్న స్థానిక బ్రాండ్లకు ఆర్డర్లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ బ్రాండ్ల నుంచి నెలవారీ ముడుపులు వసూలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి) ఈ లంచాల సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ ముడుపులు హవాలా నెట్‌వర్క్ ద్వారా హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో లాండరింగ్ చేసినట్లు సిట్ ఆరోపిస్తోంది.

జగన్ ఆర్థిక వ్యవహారాలను చూసుకునే వైెఎస్ అనిల్ రెడ్డి

అనిల్ రెడ్డి, జగన్‌కు వరుసకు సోదరుడు . జగన్ ఆర్థిక వ్యవహరాలు చూస్తారనే పేరు ఉంది. చెన్నైలో ఉంటారు. అనిల్ రెడ్డిపై ఇసుక కుంభకోణంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. తన పీఏ దేవరాజు ద్వారా లిక్కర్ స్కామ్ సొమ్మును సేకరించినట్లుగా భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన దేవరాజు, కేసులోని నిందితులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు సిట్ తేల్చింది. మూడు రోజులుగా దేవరాజును విచారిస్తున్న సిట్, అతనికి సాంకేతిక ఆధారాలను చూపించి ప్రశ్నిస్తున్నారు.

మరికొన్ని అరెస్టులు చేసే చాన్స్

సిట్ దర్యాప్తులో ముడుపుల సొమ్ము ఎలా, ఎవరి ద్వారా తరలించారు. చివరకు ఎక్కడికి చేరింది అనే కోణాలను పరిశీలిస్తోంది. రాజ్ కసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి, అక్కడి నుంచి ఇతర నిందితుల ద్వారా జగన్‌కు సొమ్ము చేరినట్లు సిట్ ఆరోపిస్తోంది. సిట్ మరిన్ని అరెస్టులు, సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లను దాఖలు చేసే అవకాశం ఉంది.