Andhra Pradesh Budget 2025: అసంబద్ధ రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ తమకంటూ అమరావతిని ప్రజా రాజధానిగా ఏర్పాటు చేసుకుందన్నారు పయ్యావుల కేశవ్‌. దీనికి ఆనాడు ఆమోదం తెలిపి.. అధికారంలోకి రాగానే మాట మార్చారని వైసీపీపై విమర్శలు చేశారు. మాట మార్చడమే కాకుండా.. అమరావతి విధ్వంసానికి కూడా నడుం బిగించారని ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాట పట్టి తమను తాము కాపాడుకుంటూ రాజధానిని కూడా కాపాడుకున్నారని కితాబు ఇచ్చారు.

ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. రాజధాని పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పయ్యావుల ప్రకటించారు. రాజధాని అనేది ఓ ప్రాంతం కోసం కాదు... రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసే గ్రోత్ ఇంజిన్‌గా అమరావతిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో, తెలంగాణ వృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో, మనరాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం అంతే అవసరమన్నారు పయ్యావుల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ప్రపంచ స్థాయి మౌలిక నదుపాయాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై, హైదరాబాద్‌తో నరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చేసిన కామెంట్స్‌ గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం... కాబట్టే మూడు రాజధానుల ఏర్పాటు అన్నారన్ని తెలిపారు.

ఇవాళ రాజధాని వనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని వివరించారు.కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని మరోసారి పునరుద్ఘాటించారు. తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్టు అమరావతి అని పేర్కొన్నారు. అది నిజమని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు నమకూర్చే ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దీనితో రాష్ట్ర బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన రాజధాని నగర ప్రాజెక్టుగా 'అమరావతి' మారిందన్నారు.