AP Assembly to be held from the 18th: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 18, 2025 నుంచి వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశాలు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 18న ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుం డగా, శాసనమండలి సమావేశాలు అదే రోజు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. సమావేశాల వ్యవధిని ఉభయ సభలు విడివిడిగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల ద్వారా నిర్ణయిస్తారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సమావేశాల ఏర్పాట్ల గురించి ముందుగానే వివరాలు వెల్లడించారు.

ఈ సమావేశాల్లో రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ సిక్స్ పథకాలు, అమరావతి అభివృద్ధి, బనకచర్ల ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా రాష్ట్రంలోని ముఖ్యమైన సమస్యలు , ప్రభుత్వ పథకాల పురోగతిని వివరించే అవకాశం ఉంది. పలు కీలక బిల్లులకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మునుపటి ప్రభుత్వం నుంచి వచ్చిన సవాళ్లు, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.

సమావేశాలకు ముందు, సెప్టెంబర్ 14 మరియు 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేల కోసం ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు ఈ సదస్సుకు హాజరవుతారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోక్‌సభ స్పీకర్ హాజరవుతారు, ముగింపు రోజున గవర్నర్ కూడా పాల్గొంటారు. ఈ సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వైఎస్ఆర్‌సీపీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే తాము వచ్చేది లేదని ఇప్పటికే తేల్చేశారు. అయితే వరుసగా అరవై రోజుల పాటు సభకు రాకపోతే అనర్హతా వేటు వేసే అధికారం సభకు ఉంది. ఈ దిశగా చర్యల గురించి ఆలోచిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారనున్నాయి.

గత సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి జగన్ సహా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే ప్రసంగం ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే వారు గవర్నర్ ప్రసంగ పాఠాలు చించి వేస్తూ.. నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. అధికారికంగా తాము సభకు హాజరైనట్లేనని..అందుకే అనర్హతా వేటు పడదని వారు భావించారు. అది గవర్నర్ ప్రసంగం అనేది బిజినెస్ డే కాదని.. అది లెక్కలోకి రాదని తర్వాత అసెంబ్లీ వర్గాలు చెప్పాయి. అందుకే వైసీపీ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ ఏర్పడింది.