Will YSRCP fight Andhra local elections: తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షాల తీరు మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో గట్టి పోటీనిస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, అనేక మున్సిపాలిటీలు , వార్డుల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. రాజకీయాల్లో అధికారం కోల్పోయిన వెంటనే చేతులెత్తేయకుండా, ఉనికిని చాటుకోవడంలో బీఆర్ఎస్ విజయవంతమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భవిష్యత్‌పై నమ్మకం పెట్టుకున్న బీఆర్ఎస్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సుమారు 730కి పైగా వార్డులను కైవసం చేసుకోవడమే కాకుండా, 15 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ సాధించి, మరో 30 చోట్ల అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కేటీఆర్ , హరీష్ రావు వంటి నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ క్యాడర్‌ను ఉత్తేజపరచడం పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. అధికార పక్షం ప్రలోభాలను ఒత్తిళ్లను తట్టుకుని బీఆర్ఎస్ నిలబడటం చూస్తుంటే, ఆ పార్టీ ఇంకా తన పట్టును పూర్తిగా కోల్పోలేదని అర్థమవుతోంది.

ఏపీలో వైసీపీ నీరసం.. బహిష్కరణే శరణ్యమా?

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయన్న ప్రచారం ఉన్నప్పటికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి సన్నాహాలు కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేక మంది కీలక నేతలు పార్టీని వీడటం , మౌనంగా ఉండిపోవడం జగన్ మోహన్ రెడ్డికి అతిపెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని, ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు.. ఎన్నికలను బహిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ, ఇప్పుడు స్థానిక పోరుకు కూడా దూరంగా ఉంటే అది ఆత్మహత్య సదృశమే అవుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ కూడా బీఆర్ఎస్ నుండి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఎన్నికల నుంచి తప్పుకోవడం వల్ల ప్రత్యర్థులకు ఏకగ్రీవ విజయాలను కట్టబెట్టినట్లవుతుంది. మిగిలి ఉన్న కేడర్ కూడా ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది.

క్యాడర్‌లో అయోమయం.. నాయకత్వ లోపమా?

ఏపీలో వైసీపీ నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికల బాధ్యతను తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోలేమనే భయం కొందరిలో ఉంటే, భవిష్యత్తుపై నమ్మకం లేక మరికొందరు మౌనంగా ఉన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ నాయకత్వం తమ అభ్యర్థులకు అండగా నిలబడి, చట్టపరమైన , రాజకీయ పోరాటాలు చేస్తోంది. ఈ విధమైన ధైర్యం వైసీపీ అధినాయకత్వం ప్రదర్శించకపోతే, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది.

అవకాశం వదులుకుంటే మనుగడ కష్టమే!

ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి పునాదుల వంటివి. అక్కడ బలపడితేనే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు దారులు సుగమం అవుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ సత్యాన్ని గ్రహించి పోరాడుతోంది. వైసీపీ కూడా బహిష్కరణలు, ఆరోపణలకే పరిమితం కాకుండా, తమకున్న 40 శాతం ఓటు బ్యాంకును కాపాడుకోవాలంటే ఎన్నికల బరిలో నిలవక తప్పదన్న అంచనాలు వస్తున్నాయి.