Ambati Rambabu Cases | గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని గుంటూరు నగరంపాలెం పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల కిందట తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా అంబటి రాంబాబు శనివారం (ఏప్రిల్ 18న) దీక్ష చేపట్టారు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా నిరసన దీక్ష చేపట్టి, ట్రాఫిక్‌కు అంతరాయం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగించారని గుంటూరు పోలీసులు చర్యలు చేపట్టారు.

అసలేం జరిగిందంటే..
తన నివాసంపై జరిగిన దాడికి నిరసనగా మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు. ఇటీవల తన ఇంటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని, కస్టడీలో తనను హింసించిన పోలీసులపై సైతం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఈ దీక్షకు ముందస్తు అనుమతి లేదని, దీనివల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందన్న కారణంతో గుంటూరు నగరంపాలెం పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా వైసీపీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.

దీక్షలో భాగంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘తన ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదు. పైగా నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. కానీ నా ఇంటి మీద దాడి చేసిన వారిని కనీసం 18 నిమిషాలు కూడా జైల్లో పెట్టలేదు. గుంటూరులో ఇళ్లపై దాడులు చేసే కొత్త సంస్కృతిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నాయని’ ఆరోపించారు.

టీడీపీ నేతల బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని, ప్రాణాలకు తెగించైనా చట్టపరంగా పోరాటం చేస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలీసు స్టేషన్‌లో తనను హింసించే ప్రయత్నం చేశారన్న ఆయన, ఈ అన్యాయాలపై న్యాయపోరాటంతో పాటు ప్రజాపోరాటానికి సైతం సిద్ధమని హెచ్చరించారు. తనది ధర్మపోరాటమని, తనపై, ఇంటిపై దాడికి బాధ్యులైన ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.