Amaravati Mega Metropolitan Region: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రాజెక్టుల పురోగతిపై ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సముదాయం మాత్రమే కాదు.. విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానమైన సమగ్ర బృహత్ రాజధాని ప్రాంతం అంటూ చంద్రబాబు ఇచ్చిన స్పష్టత, అమరావతి బ్రాండ్‌ను పునర్నిర్మించే వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది. విజయవాడ-గుంటూరు-అమరావతిలను కలిపి ఒక మెగా మెట్రోపాలిటన్ రీజియన్‌గా తీర్చిదిద్దడమే ఏపీ భవిష్యత్ ఆర్థిక, సామాజిక దిశను నిర్దేశించే అసలైన మాస్టర్ ప్లాన్ అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

రాజధాని పరిధిని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం

ఈ ప్రకటన వెనుక విస్తృతమైన రాజకీయ, నరేటివ్ పోరాటం దాగి ఉంది. గత కొద్దికాలంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను తగ్గించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిరంతరం కౌంటర్ నెరేటివ్‌ను నడుపుతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మావిగన్‌లో మ అంటే మచిలిపట్నం..మిగతా రెండు విజయవాడ, గుంటూరు. ఇప్పుడు చంద్రబాబు చెప్పిన దాంట్లో మచిలీపట్నం లేదు. మిగతా అంతా సేమ్. మాది విజన్, మీది కేవలం 29 గ్రామాల రియల్ ఎస్టేట్ మోడల్ అని చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా రాజధానిపై ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వైఎస్సార్సీపీ ప్రధాన రాజకీయ వ్యూహంగా మారింది. దీనికి చెక్ పెడుతూనే, సాధారణ ప్రజల్లో ఉన్న సంకోచాలను తొలగించేందుకు చంద్రబాబు ఈ త్రివేణీ సంగమం ఫార్ములాను తెరపైకి తెచ్చారు. కేవలం 29 గ్రామాలలోని కోర్ క్యాపిటల్ ఏరియానే రాజధానిగా ప్రచారం కావడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర లేదా పల్నాడు ప్రజల్లో ఇది అందరి రాజధాని కాదు అనే భావన కలిగే ప్రమాదం ఉంది. అందుకే, విజయవాడ, గుంటూరు నగరాల ఆర్థిక వ్యవస్థను, మౌలిక వసతులను అమరావతితో ఐక్యపరిచి, 80 లక్షలకు పైగా జనాభాను కవర్ చేసే ఒక విశ్వనగరంగా డెవలప్ చేస్తామని చెప్పడం ద్వారా ఈ ప్రాజెక్టుకు ప్రాంతీయ ఆమోదాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

పనుల్లో శరవేగం

రూ.50,999 కోట్ల విలువైన 95 మౌలిక వసతుల ప్రాజెక్టులతో అమరావతిలో పనులు పునఃప్రారంభమైన వేళ, ప్రతినెల కనీసం 7.92 శాతం పురోగతి సాధించాలని చంద్రబాబు క్షేత్రస్థాయి అధికారులకు నిర్దేశించిన గడువు కేవలం నిర్మాణ వేగాన్ని సూచించడమే కాకుండా.. పనులను వేగవంతం చేసి స్పీడ్, క్వాలిటీ, డెలివరీ సూత్రంతో ప్రతిపక్షాల నోళ్లు మూయించాలనే పట్టుదలను ప్రతిబింబిస్తోంది. ప్రతిపక్షాలు ఇది సాధ్యం కాని కల, కేవలం భూముల ప్రకటనలు మాత్రమే అని విమర్శిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఇది అమరావతి విజన్ 2.0 అని గట్టిగా నమ్ముతోంది.

అమరావతి, మావిగన్‌కు పెద్ద తేడా లేదా ?

మరోవైపు, వైఎస్సార్సీపీ ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. జగన్ చెప్పిన మావిగన్ రూట్‌లోకే చంద్రబాబు వస్తున్నారని జగన్ విజనరీ అంటున్నారు. ఇప్పుడు అమరావతి అంటే 29 గ్రామాలు కాదని, విజయవాడ-గుంటూరుతో పాటు మచిలీపట్నాన్ని కూడా కలపాల్సిందే అని వైసీపీ సోషల్ మీడియా విభాగాలు ప్రచారం వేగవంతం చేశాయి. అంటే ఎలా చూసినా అమరావతి, మావిగన్‌కు పెద్ద తేడా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఆర్డీఏ గ్రామీణ పరిధులను, మచిలీపట్నం పోర్ట్ కనెక్టివిటీని తెరపైకి తెస్తూ.. అమరావతి నిర్మాణంలో జాప్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఈ కొత్త మెట్రోపాలిటన్ డెఫినిషన్‌ను తెరపైకి తెచ్చారనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. రాజధాని అమరావతి ప్రాంతం కేవలం భౌగోళిక నిర్మాణం కాక ఏపీ భవిష్యత్ ఆర్థిక ఇంజిన్ కాబోతుందా లేదా రాజకీయ వివాదాల నిలయంగా మిగిలిపోతుందా అనేది రాబోయే రెండేళ్లలో పనుల పురోగతి , పైనే ఆధారపడి ఉంటుంది.