Akshayakalpa Shashi Kumar: కార్పొరేట్ ఉద్యోగంలో నెలకు లక్షల జీతం.. బెంగళూరులో మంచి కెరీర్.. ఎంతోమంది కలలుగనే హోదా. కానీ, ఇవేవీ ఆయన ఆలోచనను కట్టిపడేయలేకపోయాయి. చిన్నతనంలో తన కళ్లముందే తండ్రి పడిన వ్యవసాయ కష్టాలు, రైతులు ఎదుర్కొంటున్న నష్టాలు ఆయనను ఆలోచింపజేశాయి. అందుకే 13 ఏళ్ల ఐటీ కెరీర్‌కు, విప్రోలోని లక్షల జీతమొచ్చే ఉద్యోగానికి స్వస్తి చెప్పి, వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నారు బెంగళూరుకు చెందిన శశి కుమార్. ఆ పట్టుదలే నేడు ఆయనను రూ.1,500 కోట్ల విలువైన 'అక్షయకల్ప ఆర్గానిక్స్' సంస్థకు అధినేతగా నిలబెట్టింది.

కుటుంబంలో వ్యతిరేకత.. తండ్రితో 8 ఏళ్లు మాటల్లేవు!

వ్యవసాయం లాభదాయకం కాదని, తన పిల్లలు కష్టపడకూడదని భావించిన శశికుమార్ తండ్రి, ఆయన ఉద్యోగం వదిలేసి వ్యవసాయ రంగంలోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎంతగా అంటే.. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య ఎనిమిదేళ్ల పాటు మాటల్లేవు. అయినప్పటికీ, శశికుమార్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా లక్ష్యం వైపు ముందుకు సాగారు.

వ్యాపారం మూతపడే పరిస్థితి నుండి భార్య సాయంతో

2010లో ప్రారంభమైన అక్షయకల్ప ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ప్రారంభంలో తీవ్ర ఆర్థిక సంక్షోభాలు ఎదురయ్యాయి. కంపెనీ దివాళా తీసే స్థితికి చేరుకున్న సమయంలో శశికుమార్ భార్య తన పొదుపు మొత్తమైన రూ.30 లక్షలను ఇచ్చి ప్రోత్సహించారు. ఆ డబ్బుతో సవాళ్లను దాటుకుంటూ వ్యాపారాన్ని మళ్లీ అభివృద్ధి చేశారు.

ఆర్గానిక్ డెయిరీ విప్లవం

కేవలం పాలు అమ్మడం మాత్రమే కాకుండా, సంప్రదాయ వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చడమే అక్షయకల్ప ప్రధాన లక్ష్యం. రైతులకు సాంకేతికత, సేంద్రీయ పద్ధతులపై శిక్షణ ఇచ్చి, వారి వద్ద నుండి నాణ్యమైన ఆర్గానిక్ పాలు, పాల ఉత్పత్తులను సేకరించడం ప్రారంభించారు. రసాయనాలు లేని పాలు, సహజ ఉత్పత్తులకు నగరాల్లో ఆదరణ పెరగడంతో అక్షయకల్ప బ్రాండ్ వేగంగా విస్తరించింది.

Also Read:  అమెరికా వదిలి భారత్‌కు ఐటీ నిపుణులు - 2026లో ఆల్‌టైమ్ రికార్డు.. అసలు కారణాలివే!

అంకెల్లో అక్షయకల్ప

ప్రస్తుతం సుమారు 2,800 మందికి పైగా రైతులతో కలిసి అక్షయకల్ప పనిచేస్తుంది. ఏటా రూ.600 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. నెలకు సగటున రూ.60 కోట్ల వ్యాపారాన్ని జరుగుతుందని శశి కుమార్ తెలిపారు. అక్షయకల్ప ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 1,500 కోట్లుగా ఉంది. రైతులను భాగస్వామ్యులను చేస్తూ, నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందిస్తే సంప్రదాయ వ్యవసాయం కూడా కోట్ల రూపాయల కార్పొరేట్ సామ్రాజ్యంగా మారగలదని శశికుమార్ నిరూపించారు.

Also Read:  ఒడిశాలో ఏపీ ఎన్నికలా.. ఆంధ్రా గో బ్యాక్ అన్న బీజేపీ ఏం చెస్తుంది? నవీన్ పట్నాయక్ ఆగ్రహం