Govt tightens digital rules on AI mandates labelling: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెస్తోంది. ఇకపై ఏఐ ద్వారా సృష్టించిన లేదా మార్పులు చేసిన ఫోటోలు, వీడియోలు, ఆడియోలు వంటి సింథటిక్ కంటెంట్‌ ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు విధిగా గుర్తించాలి. అటువంటి కంటెంట్‌పై ఇది ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టంగా తెలిసేలా లేబులింగ్ లేదా వాటర్‌మార్క్ వేయడం తప్పనిసరి చేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లదే బాధ్యత

ఈ కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు అప్‌లోడ్ చేసే కంటెంట్ ఏఐ సృష్టించినదా కాదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత పూర్తిగా ఫేస్‌బుక్, ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలదే. ఒకవేళ ప్లాట్‌ఫారమ్‌లు అటువంటి కంటెంట్‌ను గుర్తించడంలో లేదా లేబుల్ చేయడంలో విఫలమైతే, ఐటీ చట్టం కింద వారికి లభించే సేఫ్ హార్బర్ వినియోగదారుల పోస్టులకు కంపెనీ బాధ్యత వహించనక్కర్లేదు అనే వెసులుబాటు రక్షణను కోల్పోయే అవకాశం ఉంది.

డీప్‌ఫేక్ అరాచకాలకు అడ్డుకట్ట

ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ముఖాలను మార్చి సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోల వల్ల ఎదురవుతున్న ముప్పును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏఐ కంటెంట్‌ను ముందే గుర్తించడం ద్వారా ప్రజలు తప్పుదోవ పట్టకుండా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సామాజిక మాధ్యమాలు తమ అల్గారిథమ్స్‌ను మార్చుకుని, ఏఐ కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖ సూచించింది.

వినియోగదారుల భద్రతే లక్ష్యం

డిజిటల్ ప్రపంచంలో విశ్వసనీయతను పెంచడం , ఇంటర్నెట్ వినియోగదారుల భద్రతను కాపాడటం ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. తప్పుడు సమాచారం దేశ భద్రతకు లేదా సామాజిక సామరస్యానికి భంగం కలిగించకుండా ఉండాలంటే పారదర్శకత అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది.