AI Data Center in Vizag: విశాఖపట్నం: సాగర తీర నగరం విశాఖలో ఇదివరకే ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయబోతుంది. రూ.16 వేల కోట్లతో సిఫీ సంస్థ డేటా సెంటర్ కాంప్లెక్స్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అనుమతి తీసుకుంది. తాజాగా విశాఖపట్నం నగరానికి మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ రాబోతోంది. గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏఐ పవర్‌ డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపింది. దాని ద్వారా ఏఐ టెక్నాలజీతో విశాఖలో వేలాది కొత్త ఉద్యోగాలు రానున్నాయి.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంస్థ

1,000 మెగావాట్ల డేటా సెంటర్ కోసం రైడెన్ సంస్థ రూ.87,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. వచ్చే రెండున్నరేళ్లలో మొదటి దశ యూనిట్‌ను పూర్తి చేయాలని సంస్థ తమ ప్రతిపాదనల్ని ఏపీ ప్రభుత్వానికి పంపింది. గూగుల్‌ సంస్థ కూడా విశాఖపట్నంలో రూ.52 వేల కోట్లతో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. సిఫీ సంస్థ డేటా సెంటర్‌ కాంప్లెక్స్‌కు నిర్ణయం తీసుకుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరుపుతోంది. అందుకు సంబంధించి స్థలం, అనుమతలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

రైడెన్‌ సంస్థ ప్రతిపాదించిన స్థలాలు
రైడెన్‌ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవెట్ లిమిటెడ్ సంస్థ విశాఖపట్నం జిల్లాలో 3 చోట్ల డేటా సెంటర్లను ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఇందుకోసం తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్‌లో 160 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించి, రెండున్నరేళ్లలో మొదటి దశ పనులు పూర్తిచేయనుంది. రైడెన్‌ సంస్థ ప్రస్తావించింది. 2026 మార్చి నాటికి నిర్మాణాలు ప్రారంభించి, 2028 జులై నాటికి పనులు పూర్తిచేసి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రతిపాదనలు పంపింది.

విద్యుత్‌ అవసరం, నిధులు
రైడెన్ సంస్థ ఏర్పాటు చేయనున్న 3 డేటా సెంటర్లకు దాదాపు 2,100 మెగావాట్ల విద్యుత్‌ అవసరం. విద్యుత్‌ సంస్థల నుండి తీసుకోవాలని సంస్థ భావిస్తోంది. తర్లువాడలో 929 మెగావాట్ల విద్యుత్, రాంబిల్లి డేటా సెంటర్‌కు 697 మెగావాట్ల విద్యుత్‌, అడవివరంలో 465 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని సంస్థ వెల్లడించింది.

గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌
అమెరికాకు చెందిన గూగుల్‌ ఎల్‌ఎల్‌సీకి అనుబంధ సంస్థగా రైడెన్‌ ఏపీఏసీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ కంపెనీ ఉంది. ఇది సింగపూర్‌కు చెందిన కంపెనీ. రైడెన్‌ సంస్థ నాస్‌డాక్‌ స్టాక్‌ మార్కెట్‌లో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీల జాబితాలో ఉన్నామని ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.ఈ కంపెనీ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో మెజారిటీ వాటాదారు. రైడెన్‌ ఏపీఏసీ విశాఖలో ఏఐ డేటా సెంటర్‌ కోసం నిధులు ఇవ్వనుంది.